12-09-2024 02:10:14 AM
కేటీఆర్ ట్వీట్‌పై మంత్రి సీతక్క ఆగ్రహం
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయ క్రాంతి): అబద్దాలకు అంబాసిడర్‌లా కేటీ ఆర్ సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీంపై అవాకులు, చవాకులు పేలుతున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో ఇష్టారీతీన ట్వీట్లు చేసే మీరు సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమును ఫార్స్‌గా మార్చిన విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. ఏజెన్సీలకు మీరు బకాయి పెట్టిన రూ.3.5 కోట్లను మా ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు.
బీఆర్‌ఎస్ పాలనలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి ఇప్పుడు పేద పిల్లలపై ఒలుక బోస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడే నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 24.85 లక్షల మంది విద్యార్థులుంటే... బీఆర్‌ఎస్ దిగిపోయే నాటికి 18.06 లక్షలకు సంఖ్య పడిపోయిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరు వల్లనే తెలంగాణ విద్యా రంగం విద్యా ప్రమాణాల్లో 34వ స్థానానికి పడిపోయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.