12-09-2024 02:13:35 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ హయాంలో అమలైన సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను అర్ధాంతరంగా ఆపేసి, ఇదే పథకాన్ని మొదలుపెట్టాలని కేంద్రానికి మొరపెట్టుకోవడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ర్టంలోని సుమారు 28 వేల పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థుల పొట్టగొట్టారని బుధవారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. చిన్నారులకు నాణ్యమైన విద్యతోపాటు.. పౌష్ఠికాహారాన్ని అందించాలన్న ఆలోచన ఈ పథకం వెనక దాగి ఉందనే విషయాన్ని కాంగ్రెస్ గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు. వాల్మికీ స్కామ్ డబ్బులనే కాంగ్రెస్ లీడర్లు మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో వాడారని కేటీఆర్ ఆరోపించారు.
ఈ కుంభకోణంలో కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ మంత్రి బీ నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన చార్జిషీట్‌లో నిర్ధారించిందన్నారు. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’కు చెందిన రూ.187 కోట్లు ఏకంగా కాంగ్రెస్ మంత్రి చేతులమీదుగా దారిమళ్లాయన్నారు. వాల్మీకి స్కామ్‌లో ప్రధాన నిందితుడు సత్యనారాయణ వర్మ హైదరాబాద్‌కు చెందిన బిల్డర్ అని, తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక కాంగ్రెస్ నేతలకు సత్యనారాయణ వర్మ అత్యంత సన్నిహితుడన్నారు.
మరో ట్వీట్‌లో తెలంగాణ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఉపయోగించిన రూ.20 కోట్ల నగదు కాంగ్రెస్ కీలక నాయకుడి అనుచరుడిదే అని తేలిందని వాపోయారు. ఈ వ్యవహారానికి సంబంధించి లోతుగా విచారణ జరిపితే తెలంగాణ కాంగ్రెస్‌లోని పెద్ద నాయకుల పేర్లు బయటికి వస్తాయన్నారు.