06-02-2026 12:00:00 AM
జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి
నిజామాబాద్, ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి) : మున్సిపల్ ఎన్నికల నిర్వహణ విధులలో నిమగ్నం అయి ఉన్న ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఐ.డీ.ఓ.సీ(కలెక్టరేట్), మున్సిపల్ కార్యాలయాలలో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులు సంబంధిత కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు ఐ.డీ.ఓ.సీ(కలెక్టరేట్) లో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం వినియోగించుకునేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు.
అదేవిధంగా బోధన్ మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారు బోధన్ మున్సిపల్ కార్యాలయంలో, ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో, భీంగల్ మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు భీంగల్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు.
ఈ నెల 07, 08 తేదీలలో ఆయా కార్యాలయాల పని వేళల్లో పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలని, ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది ఈ నెల 08న పోస్టల్ బ్యాలెట్ సదుపాయం వినియోగించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.