అడవి పంది వేట..నిందితుడిపై కేసు నమోదు
సిరికొండ, ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి): సిరికొండ మండల రేంజ్ పరిధిలో అడవిపందిని వేటాడిన వ్యక్తిపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. సిరికొండ అటవీ శాఖ అధికారి నర్సింగరావు తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఉదయం న్యావనంది బీట్ పరిధిలోని కంపార్ట్మెంట్ నెంబర్ 398లో తనిఖీలు నిర్వహించారు.
ఈ అకాస్మిక తనిఖీల్లో నిప్పులపై కాల్చుతున్న అడవి పంది, అడవి పంది నీ చంపిన నర్సింగ్ పల్లి కి చెందిన ధరకట్ల రవితేజ అనే వ్యక్తి పై వన్యప్రాణుల చట్టం 1972 ప్రకారం కేసు నమోదు చేసినట్లు సిరికొండ రేంజ్ అధికారి కె. నర్సింగరావు తెలిపారు. నిందితుడిపై వన్యప్రాణుల చట్టం1972లోని సెక్షన్ల 9, 39, 50, 51, 54, 57 ఆర్/డబ్ల్యూ 2(16), 2(36) కింద కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. వన్యప్రాణుల చట్టం1972 ప్రకారం ప్రతి అడవి జంతువుకు జీవించే హక్కు ఉందని, వాటిని చంపే అధికారం ఎవరికీ లేదని అటవీ అధికారి తెలిపారు.
ఎవరైనా అడవి జంతువులను వేటాడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అడవి జంతువుల వల్ల పంట చేనుల్లో నష్టం జరిగితే రైతులు అటవీశాఖ, రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులకు దరఖాస్తులు తీసుకోవాలని ఆయన సూచించారు. పంట నష్టం అంచనా వేసిన అనంతరం రెవెన్యూ, వ్యవసాయ అధికారుల నివేదికల ఆధారంగా అటవీశాఖ ద్వారా నష్టపరిహారం అందజేస్తామని తెలిపారు.
వ్యవసాయ పంటలకు ఎకరాకు రూ.6,000, హార్టికల్చర్ పంటలకు ఎకరాకు రూ.7,500 చొప్పున నష్టపరిహారం చెల్లించ బడుతుందని తెలిపారు. రైతులు, గ్రామ ప్రజలు అడవి జంతువులను చంపకుండా, వేటగాళ్లు అడవిలో అక్రమ వేట కార్యకలాపాలకు పాల్పడవద్దని వేటకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని సిరికొండ రేంజ్ అధికారి నర్సింగరావు హెచ్చరించారు.




