10 August, 2026 | 2:49 AM

మత్తు ఉన్మాదానికి యువ వైద్య విద్యార్థిని బలి!

10-08-2026 01:40 AM

విషాదంలోనూ అవయవదానానికి తల్లిదండ్రుల అంగీకారం

ఏడు రోజుల మృత్యు పోరాటం అనంతరం ప్రియాంక తుదిశ్వాస

“మా అమ్మాయికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు”

అయిజ, ఆగస్టు 9: మద్యం మత్తులో వాహనం నడిపిన వారి నిర్లక్ష్యానికి ఓ యువ వైద్య విద్యార్థిని బలైన ఘటన కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులను తీవ్ర విషాదంలో ముంచింది. తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిన బాధను దిగమింగుకుంటూనే.. మరొకరి జీవితానికి వెలుగునిచ్చేలా ఆమె అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు అంగీకరించడం అందరి మనసులను కదిలించింది. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన కనిక వెంకటేష్ కుమార్తె ప్రియాంక వైద్య విద్యను అభ్యసిస్తోంది.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఈ నెల 3న స్నేహితులతో కలిసి సినిమా చూసి తిరిగి వస్తుండగా రాజమండ్రి పరిధిలో ఆమె ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక కోమాలోకి వెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుమారు ఏడు రోజుల పాటు మృత్యువుతో పోరాడింది. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం 3.35 గంటలకు ప్రియాంక తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

 *“మా అమ్మాయికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదు”* 

ప్రమాదానికి కారణమైన వారిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ఇలాంటి ఘటనలకు కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మా అమ్మాయికి జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదనే ఉద్దేశంతో ఈ బాధలోనూ మాట్లాడుతున్నాం. తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడాలని ప్రియాంక పెదనాన్న ఆవేదన వ్యక్తం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

డాక్టర్ కావాలన్న కల.. విషాదంగా ముగిసిన ప్రయాణం

ప్రియాంక వైద్య విద్యను పూర్తి చేసి డాక్టర్గా ఎంతోమందికి సేవ చేయాలన్నది కుటుంబ సభ్యుల కల. తమ కుమార్తె భౌతికంగా తమ మధ్య లేకపోవడం తీరని లోటని, ఆమె అవయవదానం ద్వారా మరికొందరి జీవితాల్లో వెలుగుగా నిలవడం కొంతైనా తమకు తృప్తినిస్తుందని వారు పేర్కొన్నారు.

విషాదంలోనూ మహోన్నత నిర్ణయం 

కుమార్తెను కోల్పోయిన తీవ్ర విషాదంలోనూ ఆమె అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు అంగీకరించడం పట్ల గ్రామస్తులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. తమ కళ్ల ముందే కన్నబిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు.. మరో కుటుంబంలో ఆశలు చిగురించాలనే గొప్ప నిర్ణయం తీసుకోవడం మానవత్వానికి నిదర్శనమని పలువురు కొనియాడారు. యువ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతితో ఎక్లాస్పూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రతి ఇంటా ఆమె కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు