14 July, 2026 | 4:56 PM

Breaking News

20లోగా ఓటర్ల సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ   •   ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •  

ఆర్మీ కోచింగ్‌కు డబ్బులివ్వలేదని రైలు పట్టాలపై కారుతో యువతి హల్‌చల్

27-06-2025 12:06 AM
  1. రామచంద్రాపురం-శంకర్‌పల్లి మధ్య దూసుకెళ్లిన కారు    
  2. అడ్డుకోబోయిన స్థానికులపై దాడికి యత్నం
  3. ఈ పరిణామాలతో ట్రైన్‌ను నిలిపివేసిన లోకో పైలెట్ 
  4. రెండు గంటలపాటు పలు రైళ్లకు అంతరాయం
  5. పోలీసుల అదుపులో ఉత్తరప్రదేశ్ యువతి

చేవెళ్ల, జూన్ 26: ఆర్మీ ఆఫీసర్ కోచింగ్ తీసుకునేందుకు తల్లిదండ్రులు డబ్బులు పంపకపోవడంతో మనస్థాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. అందుకు ఏకంగా రైలు పట్టాలపై కారు నడుపుతూ హల్‌చల్ చేసింది. అడ్డుకున్న స్థానికులపైనా దాడికి యత్నించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన హోమిక సోనీ (32) నానక్ రాంగూడలోని శ్రీనిక ఇన్ హాస్టల్‌లో ఉంటోంది. 

గతంలో ఆమె ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసేది. కొన్నాళ్ల కింద ఉద్యోగం పోయింది. అంతేకాదు తన భర్త నుంచి విడాకులు కూడా తీసుకుంది. ఈ క్రమంలో  ఆర్మీ ఆఫీసర్ కావాలనుకుంది. అయితే ఆర్థికంగా ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో కోచింగ్ కోసం తల్లిదండ్రులను డబ్బులు అడిగింది. అయితే వారు ఎలాంటి ఆర్థిక సాయం అందించకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.

ఈ క్రమంలో గురువారం ఉదయం రంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం నాగులపల్లి వద్ద పట్టాలపై కారును ఎక్కించింది. అక్కడి నుంచి శంకర్‌పల్లి వైపు వెళ్లే మార్గంలో నడుతుపుతుండగా రైల్వే సిబ్బం ది, స్థానికులు గమనించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా పట్టించుకోకుండా మరింత వేగంగా నడుపుతూ దాదాపు ఏడు కి.మీ.ల దూరం వరకు దూసుకెళ్లింది. 

ఆ తర్వాత కొందరు యువకులు ఆమె కారును అడ్డగించి డోర్ తీసే ప్రయత్నం చేయగా వారిపై నాంచాక్‌తో దాడికి యత్నించింది. అయినా యువకులు ఆమెను కిందకు దింపి, కారును పక్కకు నిలిపారు. అక్కడికి చేరుకున్న రైల్వే సిబ్బంది హోమికను పోలీసులకు అప్పగించారు. అదే సమయంలో ఆ మార్గంలో వస్తున్న రైలులోని లోకోపైలట్ అప్రమత్తమై ఈ పరిణామాలను చూసి రైలును నిలిపివేశారు.

దీంతో ఈ మార్గంలో దాదాపు రెండు గంటల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కాగా పోలీసులు యువతిని, కారును అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె మానసిక పరిస్థితి బాగా లేదని గుర్తించి, చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రిలో సైకాలజిస్టు వద్దకు వైద్య పరీక్షల కోసం పంపించారు.