యువతే దేశ రాజకీయాలను శాసించే శక్తి
- స్థానికులకు ఉద్యోగాలు.. కాలుష్యానికి అడ్డుకట్ట వేయాలి
- త్వరలో ‘చలో దివిస్’ : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
మునుగోడు,(విజయక్రాంతి): యువత దేశ రాజకీయాలను మార్చే శక్తిగా ఎదగాలని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. నిరుద్యోగం, ఉద్యోగాల భర్తీ, విద్య, ఉపాధి సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. గురువారం మునుగోడులో నిర్వహించిన ఏఐవైఎఫ్ నల్లగొండ జిల్లా 15వ ప్రతినిధుల మహాసభల్లో ఆయన మాట్లాడారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడంతోపాటు కాలుష్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనకు త్వరలో ‘చలో దివిస్’ కార్యక్రమం చేపడతామని తెలిపారు.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. విద్య, వైద్యం వ్యాపారమయం కావడంతో పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పెరిగిందన్నారు. అందరికీ ఉచిత నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని కోరారు.ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ.. నీట్ సహా పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు, అవకతవకలను అరికట్టి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
ఏఐవైఎఫ్ నాయకులు తీర్పారీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ, ఉపాధి హామీలను అమలు చేయాలని, రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుదారులకు రుణాలు మంజూరు చేయాలని కోరారు. మహాసభలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురిజ రామచంద్రం, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్. అంజాచారి, నల్పరాజు రామలింగయ్య, మండల కార్యదర్శి చాపల శ్రీనివాస్, నల్పరాజు సతీష్‌కుమార్, బీమనపల్లి రమేష్, బుర్ర శేఖర్, జిల్లా యాదగిరి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు బి. జగన్, జిల్లా కార్యదర్శి చెల్లం పాండురంగారావు ఉన్నారు.






