12 August, 2026 | 1:36 AM

ప్రపంచ చోదకశక్తి యువత

12-08-2026 12:00 AM

‘లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించకండి’ అంటారు స్వామి వివేకానంద.. ఈ సూక్తి యువతలోని అపారమైన శక్తిని మేల్కొలుపుతుంది. ఏ సమాజమైనా ప్రగతిపథంలో ముందుకు సాగాలంటే యువత ఆలోచనలు, ఉత్సాహం చాలా ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయ, ఆర్థిక, పర్యావరణ పరిస్థితుల నేపథ్యంలో వారి సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అందుకే ఐక్యరాజ్యసమితి 1999లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా, 2000వ సంవత్సరం నుంచి ప్రపంచ దేశాలన్నీ యేటా ఆగస్టు 1౨న అంతర్జాతీయ యువజన దినోత్సవం నిర్వహించాలని పిలుపునిచ్చింది.

ప్రస్తుతం ప్రపంచంలో 10 నుండి 24 ఏళ్ల మధ్య ఉన్న యువత సంఖ్య రికార్డు స్థాయిలో 120 కోట్లకు పైగా ఉంది. సాంకేతిక విప్లవం, డిజిటల్ యుగంలో నేటి యువత కొత్త ఆవిష్కరణలకు చిరునామాగా మారుతున్నది. వాతావరణ మార్పులపై పోరాటం నుంచి సామాజిక న్యాయం వరకు అనేక అంతర్జాతీయ అంశాలపై గళం విప్పుతున్నది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో ‘జెన్‌జీ’ తరం చాలా కీలకమైన స్థానాన్ని ఆక్రమిస్తున్నది. ఆర్థిక వ్యవస్థకు యువ జనాభా ప్రాణాధార వంటిది.

ప్రస్తుతం పేద అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువత, యువకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని జనాభా గణాంకాలు చెబుతున్నాయి. యువతకు సరైన అవకాశాలు కల్పించి దేశాభివృద్ధిలో భాగస్వాములను చేసినప్పుడే ఆ దేశాలు అగ్రగామిలో నిలుస్తాయి. యువత ఆశలు, ఆశయాలకు తగిన విధంగా, ఆయా దేశాల విధానాలు లేకపోవడంతో సంక్షోభాలు వస్తున్నాయి. అందుకు జెన్-జీ ఉద్యమాలే శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, మడగాస్కర్‌లో జెన్-జీ ఉద్యమాలు.

ఈ తరం సృష్టించిన రాజకీయ సంక్షోభం అంతా ఇంతా కాదు. అవినీతి పాలకులు, పోలీసుల ఆరాచకాలు, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలపై తమ అసహనాన్ని వ్యక్తం చేసేందుకు నేటి తరం రోడ్డెక్కింది. తమ నిరసనలపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచేందుకు వారు సామాజిక మాధ్యమాల్ని అస్త్రంగా ఉపయోగించారు. భారత్‌లోనూ ఆ వేవ్ వచ్చింది. అభిజిత్ దీప్కే నాయకత్వంలో కాక్రోచెస్ జనతా పార్టీ యువత సమస్యలపై గళమెత్తుతున్నది.

జన్మతః డిజిటల్ ప్రపంచంతో అనుబంధం ఉన్న జెన్‌జీ ‘డిజిటల్ నేటివ్స్’ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, స్టార్టప్ సంస్కృతిలో సత్తా చాటుతున్నది. గిగ్ ఎకానమీ, డిజిటల్ వ్యవస్థను బాసటగా మలచుకుంటూ ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నది. అయితే ఈ తరం అనేక ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటున్నది. విద్యా వ్యవస్థలో విపరీతమైన పోటీ, చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరక్కపోవడం ప్రధాన సమస్యగా మారింది. మారుతున్న సాంకేతికతకు తగినట్లుగా నైపుణ్యాలు లేకపోవడం వల్ల నిరుద్యోగం పెరుగుతున్నది. ఉపాధి అవకాశాలు సరిగా లేక తప్పుడు తోవ పట్టడం, మత్తు పదార్థాల బారిన పడడం వంటి సామాజిక ప్రమాదాలు పొంచి ఉన్నాయి.

సాంకేతికతపై అధికంగా ఆధారపడటం వల్ల వ్యక్తిగత సంబంధాలు తగ్గిపోతున్నాయి. సైబర్ నేరాలు, స్క్రీన్ టైమ్ విపరీతంగా పెరుగుతున్నాయి. సోషల్ మీడియా సృష్టించే వర్చువల్ ప్రపంచంలో ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఒంటరితనం, ఆందోళన, డిప్రెషన్ వంటి తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలు వీరిని వేధిస్తున్నాయి. ఆర్థిక అభద్రత వల్ల భవిష్యత్తుపై స్పష్టత లేక చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి యువత సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కొత్త నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలి. సంప్రదాయ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా స్వయం ఉపాధి, వ్యాపార రంగాల వైపు దృష్టి సారించాలి. 

భారత్ లాంటి దేశాలు ఉత్పాదకత కలిగిన యువ జనాభాతో ‘జనాభా లబ్ధి’ పొందుతున్నాయి. మన దేశంలో సగటు వయస్సు 28 ఏళ్లు మాత్రమే కావడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే అరుదైన అవకాశాన్ని ఇస్తున్నది. దేశ శ్రేయస్సు కోసం జెన్‌జీ తరం బాధ్యతాయు తంగా ముందడుగు వేయాలి. మూఢనమ్మకాలు, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి. పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటడం, స్వచ్ఛత వంటి కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనాలి.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాత్మక ప్రక్రియల్లో యువత భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తూ, వారి సృజనాత్మకతను సమాజ శ్రేయస్సుకు మళ్లించాలి.

 ఏవీ సుధాకర్, స్టేట్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు, సెల్: 90006 74747