20 June, 2026 | 2:41 AM

వికసిత భారత్ లక్ష్యసాధనలో యువశక్తి కీలకం

20-06-2026 12:11 AM
  1. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి
  2. ఘనంగా వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన 

ముషీరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): వికసిత భారత్ లక్ష్య సాధనలో యువశక్తి కీలకమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని ఆర్టీసీ కళాభవన్లో నిర్వహించిన ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన(పీఎం-వీబీఆర్ వై) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో యువశక్తి కీలకమని అన్నారు. యువతకు నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.

రూ.99,446 కోట్ల వ్యయంతో అమలవుతున్న పీఎం-విబిఆర్ వై పథకం ద్వారా రెండేళ్లలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలను ప్రోత్సహించడం లక్ష్యమని తెలిపారు. మొదటిసారి ఫార్మల్ ఉద్యోగాల్లో చేరే యువతకు రూ.15,000 వరకు ప్రోత్సాహకం అందించడంతో పాటు, కొత్త ఉద్యోగాలు కల్పించే సంస్థలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. తెలంగాణలో 25 వేలకుపైగా సంస్థలు ఈ పథకంలో నమోదు చేసుకోగా, ఇప్పటికే 18 వేలకుపైగా సంస్థలు అదనపు ఉపాధి అవకాశాలు కల్పించి ప్రయోజనాలు

పొందుతున్నాయని వెల్లడించారు. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ముద్రా యోజన, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలు యువతను ఉద్యోగార్థుల నుంచి ఉద్యోగాల సృష్టికర్తలుగా తీర్చిదిద్దుతున్నాయని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి ద్వారా యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి హరిచందన, బిజెపి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.