యువత సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహమాన్
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): యువత సమాజ సేవలో నిరంతరం ముందుండాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం (టీయుడబ్ల్యూజే) కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహమాన్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని వారసంత సందర్భంగా యు బీ వై (UBY) ఫౌండేషన్ అధ్యక్షులు ఉబెద్ బీన్ యాహియా (తారిఖ్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ప్రజలకు అంబలిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ ఎండ తీవ్రత దృష్ట్యా సామాన్య ప్రజల దాహార్తిని తీర్చడానికి తారిఖ్ ఆధ్వర్యంలో గత కొన్ని ఏళ్లుగా అంబలి పంపిణీ కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. తోటి వారికి సహాయం చేయడంలోనే నిజమైన తృప్తి ఉంటుందని, ప్రతి ఒక్కరూ తమ వంతుగా సామాజిక బాధ్యతను చాటుకోవాలని సూచించారు. యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు వస్తుందని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యు బీ వై ఫౌండేషన్ అధ్యక్షులు ఉబెద్ బీన్ యాహియా, యాదవ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ యాదవ్, ఫౌండేషన్ సభ్యులు మెహరాజ్ హుస్సేన్, తహేర్, అబ్ధుల్ అఖిబ్, ఉమర్ ఆఫ్ఫారి తదితరులు పాల్గొన్నారు.






