25 August, 2026 | 11:34 PM

శ్రమకు యువత దూరం

25-08-2026 12:00 AM

ఏ దేశానికైనా యువతే చోధక శక్తి. యువత శ్రమిస్తేనే దేశం ప్రగతిపథంలో పయనిస్తుంది. యువశక్తి నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటే, ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతోపాటు దేశం కూడా ఆర్థికంగా బలోపేతమవుతుంది. అయితే, దేశాభివృద్ధిలో అంతటి ప్రాముఖ్యం ఉన్న యువ జనాభాలో సింహభాగం ఉద్యోగం, ఉపాధి, విద్య, నైపుణ్యాభివృద్ధికి దూరంగా ఉండటం కలవరపెడుతున్నది.

దేశంలో సుమారు 9 కోట్ల మంది యువత శ్రామిక శక్తిగా మారలేదని నీతి ఆయోగ్ వెలువరించిన నివేదిక పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. కాగా, ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలో ఏదో ఒక కొలువు చేయకపోగా స్వయం ఉపాధి మార్గాలను అన్వేషించకపోవడం, కనీసం నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ప్రయత్నించకపోవడం మరింత కలచివేస్తున్నది. చదువుకు తగ్గ ఉద్యోగం లభించకపోవడం, ప్రైవేట్ కొలువులకు కావాల్సిన నైపుణ్యాలు లేకపోవడం, నైపుణ్య శిక్షణ భారంగా మారడం వంటివి ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా తెలుస్తున్నది.

మన దేశంలో నిరుద్యోగ సమస్య తారస్థాయికి చేరుకున్న మాట వాస్తవమే. విద్యావంతులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదనే వాస్తవాన్ని కూడా యువత గుర్తెరగాలి. అందువల్ల ప్రభుత్వ కొలువు కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూస్తూ విలువైన సమయాన్ని వృథా చేసుకోవడం వల్ల ఇటు యువతకు, అటు దేశానికి తీరని నష్టం జరుగుతున్నదని చెప్పక తప్పదు. అయితే, ఉద్యోగం చేయకపోవడానికి పూర్తిగా యువతను బాధ్యులను చేయడం కూడా సబబు కాదు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడం, ముఖ్యంగా చదువుకు, జాబ్ మార్కెట్ అవసరాలకు మధ్య అంతరం ఉండటాన్ని విస్మరించకూడదు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం యువతకు నైపుణ్య శిక్షణ, పరిశ్రమలకు అనుగుణమైన విద్య, స్వయం ఉపాధికి రుణాలు, చిన్న వ్యాపారాలకు ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో యువత కూడా అవకాశాల కోసం ఎదురుచూస్తూ కాలాన్ని కరిగించడం సరికాదు. ఉపాధి మార్గాలు లేవనే సాకుతో చెడు వ్యసనాలకు బానిసలుగా మారి, కుటుంబానికి భారంగా వారి కుటుంబంతోపాటు దేశ భవిష్యత్తునూ దెబ్బతీస్తుందని గ్రహించాలి. దేశంలో జననాల రేటు తగ్గుతున్న తరుణంలో భవిష్యత్తులో వృద్ధుల సంఖ్య పెరిగి, శ్రామిక శక్తి తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువతే శ్రామికశక్తిగా మారి దేశానికి వెన్నెముక కావాలి.