మఖ్దూం గళం విప్లవ కలం
తెలంగాణ నేలపై అక్షరానికి ఉద్యమ దక్షతను, కవిత్వానికి సామాజిక చైతన్యాన్ని, గళానికి పీడిత ప్రజల పక్షపాతాన్ని ప్రసాదించిన అరుదైన యుగపురుషుడు మఖ్దూం మొహియుద్దీన్. కవి, అధ్యాపకుడు, కార్మిక నాయకుడు, కమ్యూనిస్టు ఉద్యమ రథసారథి, ప్రతిపక్ష నేత ఇన్ని పార్శ్వాలను ఒకే జీవితంలో సమన్వయపరిచిన ఆయన తెలంగాణ చరిత్రలోనే కాక, భారత ప్రగతిశీల సాహిత్య రాజకీయ యవనికపై అజరామరంగా నిలిచిపోయారు.
అబూ సయీద్ మహ్మద్ మఖ్దూం మొహియుద్దీన్ ఖుద్రీ 1908 ఫిబ్రవరి 4న ఉమ్మడి మెదక్ జిల్లా ఆందోల్ గ్రామంలో జన్మించారు. ఆయన పూర్వీకుల మూలాలు ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌కు చెందినవైనా, దక్కన్ మట్టిలో వేళ్లూనుకుని తెలంగాణ బిడ్డగా ఎదిగారు.
పల్లెల్లోని దారుణమైన పేదరికం, దొరల గడీల అణచివేత, భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీలను ప్రత్యక్షంగా దర్శించిన మఖ్దూం ఆలోచనా ప్రపంచం క్రమంగా మానవతావాదం, మార్క్సిస్టు భావజాలం వైపు మళ్లింది. మఖ్దూం జీవితాన్ని మలుపు తిప్పిన ప్రధాన ఘట్టం ప్రగతిశీల రచయితల ఉద్యమ నిర్మాణం. 1936లో లక్నోలో మున్షీ ప్రేమ్‌చంద్ అధ్యక్షతన అఖిల భారత ప్రగతిశీల రచయితల సంఘం ఏర్పాటైన స్ఫూర్తితో హైదరాబాద్‌లో మఖ్దూం ప్రగతిశీల రచయితల సంఘం శాఖను నెలకొల్పారు.
1941లో ఆయన స్థాపించిన ‘కామ్రేడ్స్ అసోసియేషన్’ నిజాం వ్యతిరేక, అభ్యుదయ భావజాల ప్రచారానికి ప్రధాన కేంద్రంగా మారింది. 1940లో కమ్యూనిస్టు పార్టీలో చేరిన ఆయన చండ్ర రాజేశ్వరరావు, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి వంటి మహానాయకులతో భుజం భుజం కలిపి నడిచారు. తెలంగాణ నేలపై ఎగిసిపడిన చారిత్రాత్మక సాయుధ రైతాంగ పోరాటం (19461951) మఖ్దూం జీవితంలో అత్యంత ఉజ్వలమైన అధ్యాయం. 10 లక్షల ఎకరాల భూపంపిణీ, 3 వేల గ్రామాలలో గ్రామ రాజ్యాల ఏర్పాటు, వెట్టిచాకిరీ విముక్తి లక్ష్యంగా సాగిన ఆ విప్లవ ఘట్టంలో మఖ్దూం తన కలాన్ని తూటాలా, గళాన్ని సమరశంఖంలా మార్చారు.
స్వాతంత్య్రానంతరం ఆయన పీడిత ప్రజల గొంతుకగా నిలిచారు. 1969 ఆగస్టు 25న ఢిల్లీ పర్యటనలో తీవ్ర గుండెపోటుకు గురై తన 61వ ఏట మఖ్దూం మొహియుద్దీన్ తుదిశ్వాస విడిచారు. మఖ్దూం భౌతికంగా మన మధ్య లేకపోయినా, దోపిడీ లేని సమసమాజ స్థాపన కోసం ఆయన రగిలించిన ఉద్యమ జ్వాల, పలికించిన విప్లవ అక్షరం నేటికీ, ఏ నాటికీ తరతరాలకు స్ఫూర్తిప్రదాతగా నిలుస్తూనే ఉంటాయి.
వ్యాసకర్త: జర్నలిస్ట్, 9440595494
రామకిష్టయ్య సంగనభట్ల






