19 March, 2026 | 3:27 AM

అదనపు కట్నం కోసమే యూట్యూబర్ వైష్ణవి హత్య

19-03-2026 12:05 AM

కోరుట్ల మార్చి 18 ( విజయ క్రాంతి ) : అదనపు కట్నం కోసమే యూ ట్యూబర్ వైష్ణవిని ఆమె భర్త హరిబాబు హత్య చేసినట్లు  మెట్ పెల్లి డీఎస్పీ అడ్లూరి రాములు తెలిపా రు. నిందితుడునీ హరిబాబును  అరెస్ట్ చేసి బుధవారం విలేకర్ల ముందు ప్రవేశ పెట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ  కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన చిత్తారి @ గంధం వైష్ణవి (వయస్సు 20 సంవత్సరాలు) గత కొంతకాలంగా యూ ట్యూబ్ ద్వారా వీడియోలు రూపొందిస్తూ ఉండేది.

గత కొన్ని నెలల క్రితం కోరుట్ల పట్టణానికి చెందిన చిత్తారి హరిబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి వైష్ణవితో వివాహం చేయమని ఆమె తల్లిదండ్రులను కోరగా, వారు కట్నం ఇవ్వలేమని స్పష్టంగా తెలియజేసినా, తరువాత కాలంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో హరిబాబు తల్లి చిత్తారి లక్ష్మి కట్నం లేకుండా వివాహానికి అభ్యంతరం వ్యక్తం చేయగా, ఒత్తిడి తీసుకొచ్చేందుకు హరిబాబు విషం సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు.

చికిత్స అనంతరం కోలుకున్న హరిబాబు మళ్లీ వివాహం కోసం ఒత్తిడి చేయగా, వైష్ణవి తండ్రి మొదట నిరాకరించారు. అయినప్పటికీ, గత సంవత్సరం మే నెలలో హరిబాబు వైష్ణవిని తీసుకెళ్లి, వెంకటాపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుండి వారు ఇరువురు మాదాపూర్ లోని వైష్ణవి తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటున్నారు. కొంతకాలం తరువాత హరిబాబు 05 లక్షలు కట్నం కావాలని కోరగా, వైష్ణవి తల్లిదండ్రు లు ఆ మొత్తాన్ని ఇచ్చి, మాధాపూర్ గ్రామం లో రెండు గుంటల భూమిని కొనుగోలు చేసి ఇచ్చారు.

అయినప్పటికీ, అదనంగా మరొక 05 లక్షలు కావాలని, తన కుమార్తెను మానసికంగా, శారీరకంగా వేధించేవా డని మృతురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. ఈ విషయంలో హరిబాబు కుటుంబ సభ్యులు కూడా ప్రేరేపించినట్లు ఆరోపించారు. సుమారు మూడు నెలల క్రితం వైష్ణవి గర్భవతిగా ఉన్నప్పటికీ వేధింపులు కొనసాగినట్లు తెలిపారు.

తాజాగా ఈ నెల 16,వ తేదీ రాత్రి 11:00 గంటల సమయంలో వైష్ణవి, హరిబాబు ఇద్దరు తమ గదిలో నిద్రకు వెళ్లగా, తెల్లవారుజామున 04:00 గంటల సమయంలో శబ్దాలు వినిపించాయని, తలుపు తట్టినా తీయకపోవడంతో తిరిగి వెళ్లినట్లు వైష్ణవి తల్లిదండ్రులు తెలిపారు. నిందితుడు హరిబాబు తన భార్య వైష్ణవిని నిద్రలో ఉండగా కత్తితో దాడి చేసి, అనంతరం గొంతు నులిమి హత్య చేసి, మంగళవారం ఉదయం 06:00 గంటల సమయంలో ఒంటరిగా బయటకు వచ్చి, ముఖం కడుక్కొని ఎవరికి తెలియకుండా తన మోటార్ సైక్పి వెళ్లిపోయాడు.

అనంతరం వైష్ణవి కుటుంబసభ్యులు గది తలుపు తెరిచి చూడగా, వైష్ణవి మంచం పక్కన రక్తపు మడుగులో పడి వుండగా, నుదిటిపై గాయాలు, మెడపై గుర్తులు ఉన్న ట్లు గుర్తించారు. తక్షణమే ఆమెను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, కోరుట్లకు తరలించగా, వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు ప్రకటించారు. 

ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు హత్య అనంతరం తన మోటార్ సైకిల్ పై ఇంటి నుండి వెళ్లి, రాయికల్  మైతాపూర్ ప్రాంతాల్లో సంచరించాడు. అనంతరం కొనరావుపేట ఎక్స్ రోడ్ సమీపంలోని ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇంటి మెట్ల కింద హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలు ఉన్న దుస్తులను దాచిపెట్టి, అక్కడే సాయంత్రం వరకు ఉన్నాడు.

విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు అదే రోజు సాయంత్రం నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు , నిందితుడిని రిమాండ్ కు తరలించి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సమావేశంలో  కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్త్స్ర చిరంజీవి, పోలీస్ కానిస్టేబుల్ లు  పాల్గొన్నారు.