యువజన ఉత్సవాలు

03-11-2026 | 09:34pm

నిర్మల్ నవంబర్ 3( విజయక్రాంతి): యువతలో దాగి ఉన్న సృజనాత్మకత, కళా నైపుణ్యాలను వెలికితీసి వారిని ప్రోత్సహించేందుకే జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాథోడ్ రమేష్(Additional Collector (Local Bodies) Rathod Ramesh) అన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్‌లో గల స్థానిక జె.వి.ఎన్.ఆర్. ఉన్నత పాఠశాలలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు - 2026లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక పోటీలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత ఇటువంటి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. స్వామి వివేకానందుని ఆశయాలు, సందేశాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని, ఆయన బోధనలను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జానపద బృంద గానం, జానపద బృంద నృత్యం, నాటిక, చిత్రలేఖనం, కవితా రచన తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు.

వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఆయా విభాగాల్లో ప్రథమ బహుమతి సాధించిన విజేతలు రాష్ట్రస్థాయిలో నిర్వహించే పోటీల్లో నిర్మల్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సేవల శాఖ అధికారి బి. శ్రీకాంత్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ పద్మావతి, పేట కార్యదర్శి భూమన్న, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు