బస్టాండ్ లో బాలుడికి ఆర్టీసీ బాసట

29-11-2026 | 04:29pm

నిర్మల్ నవంబర్ 29 (విజయక్రాంతి): కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి నిర్మల్(Nirmal) బస్టాండ్ లో వదిలివేగా ఆర్టీసీ ఆ బాలుడికి బాసటగా నిలిచింది. బస్టాండ్‌లోనే టికెట్ తీసుకొస్తానని చెప్పి కుమారుడిని అక్కడే ఉంచి తిరిగి రాకుండా సొంతూరికి వెళ్లిపోయాడు. ఎటు వెళ్లాలో ఎవరిని అడగాలో తెలియదు.. భాష కూడా రాదు. కిన్వట్ ప్రాంతానికి చెందిన వాగ్మారే అమూల్ తన కుమారుడు వాగ్మారే వైభవ్‌తో కలిసి శనివారం మధ్యాహ్నం నిర్మల్ బస్టాండ్‌కు వచ్చాడు. టికెట్ తీసుకొస్తానని చెప్పి కుమారుడిని బస్టాండ్‌లో కూర్చోబెట్టి వెళ్లిపోయాడు.

ఎంతసేపటికీ తండ్రి తిరిగి రాకపోవడంతో బాలుడు ఆందోళనకు గురయ్యాడు. సాయంత్రం వరకు ఒంటరిగా కూర్చుని బిత్తర చూపులు చూస్తున్న బాలుడిని గమనించిన డిపో మేనేజర్ కల్పన, ఆర్టీసీ సిబ్బంది అతడి వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. బాలుడికి భాష రాకపోవడంతో తొలుత వివరాలు తెలుసుకోవడం కష్టంగా మారింది. అయినప్పటికీ అధికారులు అతడిని చేరదీసి బస్టాండ్‌లోని క్యాంటీన్‌లో భోజనం పెట్టించారు. రాత్రి సమయంలోనూ బాలుడికి ఆశ్రయం కల్పించారు. అనంతరం అతడి వద్ద ఉన్న బ్యాగును పరిశీలించగా అందులో మొబైల్ నంబర్ కనిపించింది. వెంటనే ఆ నంబర్‌కు ఫోన్ చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తండ్రి వదిలేసిన బాలుడిని చేరదీసి ఆదరించిన ఆర్టీసీ అధికారుల మానవత్వంపై స్థానికులు ప్రశంసించారు.

మరిన్ని వార్తలు