అంబులెన్స్‌ల్లో ఏముంది?.. అధికారుల ఆకస్మిక తనిఖీలు

05-11-2026 | 03:36pm

బోధన్, నవంబర్ 05 (విజయక్రాంతి): ప్రజలకు అత్యవసర వైద్య సేవలు మరింత సమర్థవంతంగా అందించాలనే లక్ష్యంతో నిజామాబాద్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సంపత్, సూపర్వైజర్ స్వరాజ్ బోధన్, పోతంగల్ ప్రాంతాల్లోని అంబులెన్స్‌లను (Ambulance Inspection) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లలో అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, మందులు, వాటి పనితీరు, నిర్వహణకు సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

తనిఖీల్లో భాగంగా బోధన్, పోతంగల్ అంబులెన్స్‌లలోని వైద్య పరికరాల పనితీరును పరిశీలించారు. కాలం చెల్లిన మందులను ఎప్పటికప్పుడు గుర్తించి తొలగించాలని, అవసరమైన మందులు, వైద్య సామగ్రి అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైద్య పరికరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడంతో పాటు అవి సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా నిరంతరం పర్యవేక్షించాలని టెక్నీషియన్లకు స్పష్టం చేశారు.

అంబులెన్స్‌కు వచ్చే ప్రతి ఫోన్ కాల్‌ను అత్యవసరంగా పరిగణించి వెంటనే స్పందించాలని జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సంపత్ సూచించారు. ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులకు నిర్ణీత సమయంలో వైద్య సహాయం (Emergency Medical Services) అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బాధితుడిని ఆసుపత్రికి చేర్చే వరకు అంబులెన్స్ సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

అంబులెన్స్‌లలో నిర్వహిస్తున్న రికార్డులను కూడా పరిశీలించారు. విధులకు సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయాలని, సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని టెక్నీషియన్లు, పైలెట్లకు సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించడం ప్రతి సిబ్బంది బాధ్యత అని తెలిపారు.

ఈ ఆకస్మిక తనిఖీల్లో బోధన్ అంబులెన్స్ పైలెట్ జావిద్, టెక్నీషియన్ మాధవ్, పోతంగల్ అంబులెన్స్ పైలెట్ ఎం.డి. కలీం, టెక్నీషియన్ కె. నారాయణ పాల్గొన్నారు. అంబులెన్స్ సేవలు ప్రజలకు సకాలంలో అందాలంటే సిబ్బంది అప్రమత్తత, వైద్య పరికరాల పనితీరు, మందుల లభ్యత, సమయపాలన ఎంతో ముఖ్యమని అధికారులు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు