పెద్దపల్లి ఎంపీ లేఖలోనే అసత్య ఆరోపణలు
- శిలాఫలకమే సాక్ష్యం
- సీఎం రేవంత్ రెడ్డి పేరు స్పష్టంగా ఉన్నా లేని వివాదాన్ని సృష్టిస్తారా
- లేఖల రాజకీయాలు మాని పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి
- మంథనికి పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించే దమ్ము చూపించాలని కాంగ్రెస్ శ్రేణుల సవాల్
మంథని, నవంబర్ 27(విజయ క్రాంతి) ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల భవన ప్రారంభోత్సవ శిలాఫలకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు, ఫొటో లేదంటూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ(Peddapalli MP Gaddam Vamshikrishna) రాసిన లేఖపై మంథని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు. శిలాఫలకంపై ముఖ్యమంత్రి పేరు స్పష్టంగా ఉన్నప్పటికీ లేనట్లుగా ఆరోపణలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు.
శిలాఫలకానికి సంబంధించిన ఫొటోనే ఇందుకు సాక్ష్యమని, అందులో మొదటి వరుసలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొన్నారు. సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫొటోతో పాటు ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ పేరు కూడా శిలాఫలకంపై ఉందని గుర్తుచేశారు. కళ్ల ముందే వాస్తవాలు కనిపిస్తున్నా వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం వెనుక ఉద్దేశమేమిటని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నిరంతరం కృషి చేస్తున్నారని, ఆయన తీసుకువస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే ఇలాంటి లేఖల రాజకీయాలకు తెరతీస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు వాటిని అభినందించాల్సింది పోయి, లేని వివాదాలను సృష్టిస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని, మంత్రిని అప్రతిష్టపాలు చేయాలని చూడటం తగదన్నారు.
మంథనిలో నియంత పాలన సాగుతోందంటూ విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని, ఇలాంటి వ్యాఖ్యలతో సొంత పార్టీ ప్రభుత్వంలోని మంత్రిపైనే బురద చల్లినట్లవుతుందని అన్నారు. రాజకీయాలు చేయాలంటే ప్రజల్లో ఉండి సమస్యలు పరిష్కరించాలని, అభివృద్ధి పనులు చేసి చూపించాలని హితవు పలికారు.
ఎంపీకి కాంగ్రెస్ శ్రేణుల బహిరంగ సవాల్
లేఖలు రాసి ప్రచారం పొందడం కంటే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై ఎంపీ దృష్టి సారించాలని కాంగ్రెస్ శ్రేణులు సూచించారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతమైన మంథని నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకువచ్చి, స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేసి చూపించాలని సవాల్ విసిరారు. లేఖలు రాస్తే యువతకు ఉద్యోగాలు రావని, పరిశ్రమలు తీసుకువస్తేనే వారి భవిష్యత్తుకు భరోసా కలుగుతుందని పేర్కొన్నారు.
మంత్రి శ్రీధర్ బాబు ప్రజల్లో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఆయన నాయకత్వంలో మంథని మరింత అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
శిలాఫలకంపై సీఎం పేరు స్పష్టంగా ఉన్నప్పుడు లేని వివాదాన్ని తెరపైకి తీసుకురావడం ఎందుకని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నించాయి. రాజకీయ విమర్శల కంటే అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పనకే ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీకి హితవు పలికాయి.