వైద్యుల సమయస్ఫూర్తి.. తల్లీబిడ్డకు పునర్జన్మ!

14-11-2026 | 05:06pm

అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో అరుదైన వైద్య సేవలు

క్లిష్ట పరిస్థితుల్లో విజయవంతంగా శస్త్రచికిత్స

వైద్యులు డాక్టర్ రాధా రుక్మిణి, మౌనికను అభినందించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

అశ్వరావుపేట, నవంబర్ 14(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District), అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రి వైద్యులు మరోసారి తమ వైద్య నైపుణ్యం(Medical expertise), అంకితభావం, సమయస్ఫూర్తిని చాటుకున్నారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ గర్భిణీకి అత్యవసర వైద్య సేవలు(Emergency Medical Services) అందించి, తల్లీబిడ్డ ఇద్దరి ప్రాణాలను కాపాడి వైద్యరంగంలో ప్రశంసలు అందుకున్నారు. వైద్యులు చూపిన చాకచక్యం, బాధ్యతాయుతమైన సేవలు స్థానికంగా అభినందనలు అందుకుంటున్నాయి.

వివరాల్లోకి వెళితే అశ్వారావుపేట మండలం, గుంటిమడుగు గ్రామానికి చెందిన ఆశీ సమ్మక్క అనే గర్భిణీ ప్రసవం నిమిత్తం అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రికి రాగా, వైద్యులు ఆమెకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స చేపట్టారు. అయితే ఆ సమయంలో అనూహ్యంగా తీవ్ర రక్తస్రావం చోటుచేసుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఆందోళనకరంగా మారింది. అప్పటికే ఆమె రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి 8.1 గ్రాముల నుంచి 4.8 గ్రాములకు పడిపోవడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారడంతో తల్లిని కాపాడటం వైద్యులకు పెద్ద సవాలుగా మారింది. గర్భసంచి తొలగించాల్సిన పరిస్థితి ఎదురుకాగా, 

ఏమాత్రం ఆందోళనకు గురికాకుండా స్థానిక గైనకాలజీ వైద్యులు డాక్టర్ రాధా రుక్మిణి, డాక్టర్ మౌనిక ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించారు. అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ, అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్సను కొనసాగించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ వైద్య నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రసవాన్ని విజయవంతంగా నిర్వహించి పండంటి బిడ్డకు పురుడు పోశారు.

అనంతరం తల్లికి అత్యవసరంగా ఏబీ పాజిటివ్ గ్రూప్‌కు చెందిన ఒక యూనిట్ రక్తాన్ని ఎక్కించి, అవసరమైన వైద్య చికిత్సలు అందించారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణ, సమయోచిత వైద్య సేవల ఫలితంగా తల్లీబిడ్డ ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సరైన సమయంలో స్పందించి ఎంతో నిబద్ధతతో వైద్య సేవలు అందించిన గైనకాలజీ వైద్యుల పనితీరు పలువురి ప్రశంసలు అందుకుంది.

వైద్యులను అభినందించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ తల్లీబిడ్డ ఇద్దరి ప్రాణాలను కాపాడిన వైద్యులు డాక్టర్ రాధా రుక్మిణి, డాక్టర్ మౌనికలను అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ ప్రత్యేకంగా అభినందించారు. వైద్యులు చూపిన సమయస్ఫూర్తి, వృత్తిపట్ల అంకితభావం, సేవా దృక్పథం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం మరింత పెరిగేలా వైద్యులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది మరింత బాధ్యతతో పనిచేయాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు