కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు మంథని మున్సిపాలిటీ వినూత్న చర్యలు
ఎలుగుబంటి వేషధారణతో కోతులను తరిమే ప్రయత్నం
గంగాపురిలో ప్రత్యేక చర్యలు చేపట్టిన మున్సిపాలిటీ..
కౌన్సిలర్ ఎరుకల స్రవంతి రమేష్ బాబు చొరవ
మంథని,(విజయ క్రాంతి) మంథని పట్టణంలో కోతుల(Monkeys) బెడదకు అడ్డుకట్ట వేసేందుకు మున్సిపాలిటీ(Manthani Municipality) అధికారులు వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టారు. కోతుల సంచారంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ఎలుగుబంటి వేషధారణ(Bear Costume)తో కోతులను తరిమే ప్రయత్నం చేశారు. గంగాపురి ప్రాంతంలో చేపట్టిన ఈ ప్రత్యేక చర్య స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
గత కొంతకాలంగా గంగాపురి ప్రాంతంలో కోతుల సంచారం పెరిగి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కోతులను తరిమే చర్యలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో గంగాపురి నాలుగో వార్డు కౌన్సిలర్ ఎరుకల స్రవంతి రమేష్ బాబు(Councilor Yerukala Sravanthi Ramesh Babu) పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతున్న మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. కోతుల బెడద నుంచి ప్రజలకు శాశ్వత ఉపశమనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.