పండుగ వేళ విషాదం
టిప్పర్ ఢీకొని భార్య ప్రాణాలు బలి.. భర్తకు తీవ్ర గాయాలు
దీపావళి పండుగకు స్వగ్రామానికి వస్తుండగా మారేడుపల్లి శివారులో ప్రమాదం
ఇద్దరు పిల్లలకు తల్లి దూరం.. బొట్ల వనపర్తిలో విషాదఛాయలు
ధర్మారం, ఎండపల్లి,(విజయక్రాంతి): దీపావళి పండుగ(Diwali Festival)ను కుటుంబంతో ఆనందంగా జరుపుకోవాలనే ఆశతో స్వగ్రామానికి బయలుదేరిన ఆ దంపతుల ప్రయాణం విషాదాంతమైంది. మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో భార్య ప్రాణాలు కోల్పోగా, భర్త గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఈ ఘటనతో పెద్దపల్లి జిల్లా(Peddapalli district) ధర్మారం మండలం బొట్ల వనపర్తి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బొట్ల వనపర్తికి చెందిన ఆవుల కృష్ణ తన భార్య ప్రణీతతో కలిసి దీపావళి పండుగ కోసం గోదావరిఖని నుంచి బైక్పై స్వగ్రామానికి బయలుదేరారు. ఎండపల్లి మండలం మారేడుపల్లి శివారు ప్రాంతానికి చేరుకోగానే ఎదురుగా వచ్చిన టిప్పర్ వారి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రణీతను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు సమాచారం. గాయపడిన భర్త కృష్ణకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
కృష్ణ, ప్రణీత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పండుగ పూట తల్లి మృతి చెందడంతో ఆ చిన్నారులు తల్లిలేని వారయ్యారు. కుటుంబ సభ్యుల ఆశలు ఒక్కసారిగా ఆవిరవగా, పండుగకు వస్తూ ప్రణీత మృత్యువాత పడటంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. పండుగ వేళ చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను కలచివేసింది.