రూ.1.50 కోట్లతో నిర్మించినా ప్రారంభానికి నోచుకోని పీహెచ్‌సీ!

07-11-2026 | 06:15pm

వెంటనే అందుబాటులోకి తేవాలని బీజేపీ రాస్తారోకో..

వారం రోజుల్లో ప్రారంభిస్తామని అధికారుల హామీ

గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) గంభీరావుపేట మండల కేంద్రంలో రూ.1.50 కోట్ల వ్యయంతో  రెండేళ్ల క్రితం నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(Primary health center) వెంటనే ప్రారంభించి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల అధ్యక్షుడు కోడే రమేష్ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కామారెడ్డి-సిద్దిపేట ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి రావాలని పట్టుపట్టారు. ఈ సందర్భంగా కోడె రమేష్ మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం ఆధునిక హంగులతో నిర్మించిన ఆసుపత్రి ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోకపోవడం విచారకరమన్నారు. ఆసుపత్రి అందుబాటులో లేకపోవడంతో పేద ప్రజలు వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆసుపత్రిని ప్రారంభించి వైద్య సిబ్బందిని నియమించి 24 గంటల వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.

సమాచారం అందుకున్న తహసీల్దార్ మారుతీరెడ్డి, వైద్యాధికారి అభినయ్, ఎస్సై బాలరాజు ధర్నా స్థలానికి చేరుకుని నాయకులతో మాట్లాడారు. జిల్లా వైద్యాధికారితో చర్చించి వారం రోజుల్లో ఆసుపత్రి ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బీజేపీ నాయకులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ధార్మిక సెల్ అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి దేవసాని కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి తొట్ల మల్లేష్ యాదవ్, నాయకులు దేవేందర్ యాదవ్, అశోక్, దేవయ్య, ఎలందర్, సర్వోత్తం, ఎల్లం, రాజేష్ చారి, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు