ఓటరు జాబితాలో పేరు నమోదుకు మరో అవకాశం

07-11-2026 | 06:09pm

నవంబర్ 21 వరకు ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు గడువు

అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకూడదు

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి

ఎస్‌ఐఆర్‌-2026 ప్రక్రియపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష

పెద్దపల్లి,(విజయక్రాంతి): ఓటరు జాబితాలో పేర్లు నమోదు కాని అర్హులైన పౌరులకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి తెలిపారు. నవంబర్ 21వ తేదీ వరకు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించేందుకు గడువు పొడిగించినట్లు వెల్లడించారు. అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా అధికారులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

శనివారం ఎస్‌ఐఆర్‌-2026 ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ, ఓటరు జాబితాలో పేర్ల నమోదు, గైర్హాజరు, చిరునామా మార్పు, మరణించిన ఓటర్ల వివరాలపై సమీక్షించారు. పెద్దపల్లి జిల్లా నుంచి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. శ్రీరాములు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించని అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గైర్హాజరు, చిరునామా మార్పు, మరణం తదితర కారణాలతో ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు లేని అర్హులు సంబంధిత ఎన్నికల అధికారులకు తమ వివరాలు సమర్పించి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ ఎన్యుమరేషన్ ఫారం సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

పోలింగ్ కేంద్రాల్లో జాబితాల ప్రదర్శన తప్పనిసరి

గైర్హాజరు, చిరునామా మార్పు, మరణించిన ఓటర్ల (ఏఎస్‌డీ) వివరాలను పోలింగ్ కేంద్రాల వారీగా జాబితాల రూపంలో ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల పేర్లు జాబితాలో లేకపోవడానికి గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని, ఈ వివరాలను పోలింగ్ కేంద్రాలతో పాటు ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచాలని సూచించారు.

ఓటర్లు తమ పాత ఎపిక్‌ నంబర్ ఆధారంగా ఎన్నికల సంఘం వెబ్‌సైట్, ఈసీఐనెట్ యాప్ ద్వారా ఎన్యుమరేషన్ ఫారాలను డౌన్‌లోడ్ చేసుకొని సమర్పించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో ఎలక్షన్ డీటీ విజయ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు