ముత్తారంలో 66 ఫీట్ల రోడ్డు.. అమలులో మాత్రం అధికారుల ఇష్టారాజ్యం

27-11-2026 | 05:11pm
  1. మార్కింగ్ ప్రకారం రోడ్డు విస్తరించాలి..
  2. తారతమ్యాలపై వార్డు సభ్యుల ఆందోళనల, ఆగ్రహం
  3. రేపు క్షేత్రస్థాయిలో న్యాయం చేయకుంటే మళ్లీ ఆందోళన తప్పదని హెచ్చరిక

ముత్తారం, నవంబర్ 27(విజయ క్రాంతి) మంథని నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో నిధులు మంజూరై ముత్తారం మండల కేంద్రంలో చేపట్టిన ప్రధాన రహదారి విస్తరణ పనులు వివాదానికి దారితీశాయి. గ్రామపంచాయతీ తీర్మానం ప్రకారం 66 అడుగుల వెడల్పుతో రహదారిని నిర్మించాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా, ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారంటూ గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోడ్డు విస్తరణలో ఎలాంటి తారతమ్యాలు చూపకుండా గ్రామపంచాయతీ రికార్డులు, అధికారిక మార్కింగ్ ప్రకారమే పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ముత్తారం మండల కేంద్రంలోని కాసర్లగడ్డ చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై వార్డు సభ్యులు, ఉపసర్పంచ్ భర్తతో పాటు గ్రామస్తులు ధర్నాకు దిగారు. ప్రజాప్రతినిధులు చేసిన తీర్మానాన్ని, ప్రజల అభిప్రాయాలను పక్కనపెట్టి కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని వారు మండిపడ్డారు.

తీర్మానం ఒకటి.. పనులు మరొకటా

గ్రామపంచాయతీ పరిధిలోని ప్రధాన రహదారిని 66 అడుగుల మేర విస్తరించాలని తీర్మానం చేసినప్పటికీ, ఆర్‌అండ్‌బీ అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ ఆ తీర్మానాన్ని పట్టించుకోవడం లేదని వార్డు సభ్యులు ఆరోపించారు. రోడ్డు విస్తరణలో పలుకుబడి ఉన్నవారికి ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులు పారదర్శకంగా జరగాలని, ప్రతి ఒక్కరికీ ఒకే విధమైన న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.

ఎస్ఐ జోక్యంతో తాత్కాలికంగా విరమణ

విషయం తెలుసుకున్న ఎస్సై రవికుమార్ ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న వార్డు సభ్యులు, గ్రామస్తులతో మాట్లాడారు. అనంతరం ఆర్‌అండ్‌బీ అధికారులతో ఫోన్‌లో సంప్రదించి సమస్యను వివరించారు. శనివారం ఉదయం గ్రామానికి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారిక మార్కింగ్ ప్రకారం రోడ్డు వెడల్పు పనులు చేపట్టాలని కోరారు. దీనికి అధికారులు సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు ధర్నాను విరమించారు.

ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ.. అధికారులు ఇచ్చిన హామీ మేరకు రేపు గ్రామానికి వచ్చి రికార్డుల ప్రకారం మార్కింగ్ చేసి రోడ్డు విస్తరణ పనులు చేపడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అలా కాకుండా మళ్లీ తారతమ్యాలు చూపుతూ ఇష్టానుసారంగా పనులు కొనసాగిస్తే గ్రామ ప్రజలతో కలిసి మరోసారి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.

ఈ ధర్నాలో ముత్తారం మండల వార్డు సభ్యుల ఫోరం అధ్యక్షుడు కుక్కల చంద్రమౌళి, ముత్తారం ఉపసర్పంచ్ అమ్ము రజిత శ్రీనివాస్, వార్డు సభ్యుల ఫోరం ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్యాల లక్ష్మీ దేవేందర్, వార్డు సభ్యులు మల్యాల రమ, స్వామి, ఊదరి రమ, పెద్దులు, మేదరి రాజశేఖర్, ఐత రమేష్, పింగిలి మౌనిక, సురేందర్ రెడ్డి, మొగిలి ప్రశాంత్, చల్ల రాజేందర్ తదితరులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు