జిల్లాలో ప్రమాదాల నివారణకు పటిష్ట ప్రణాళిక అవసరం
ప్రతి పాఠశాల వద్ద స్కూల్ జోన్ బోర్డులు ఏర్పాటు చేయాలి
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, నవంబర్ 10 (విజయక్రాంతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాల(Road accidents) నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(District Collector Koya Sriharsha) అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ అరుణశ్రీతో(Additional Collector Arunasri) కలిసి రోడ్డు భద్రత ప్రమాణాల అమలుపై(Implementation of Road Safety Standards) సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఆక్రమణలు తొలగించి, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. రోడ్లపై పశువులను వదిలే వారిపై నిబంధనల ప్రకారం రూ.10 వేల జరిమానా విధించి, పశువులను గోశాలలకు తరలించాలని సూచించారు.
పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన చోట రోడ్ల విస్తరణ, డివైడర్లు, యూటర్న్‌లను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పాఠశాల వద్ద తప్పనిసరిగా స్కూల్ జోన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, పట్టణ రహదారులపై రోడ్డు గీతలు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
జిల్లాలో గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని, హిట్ అండ్ రన్ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం అందించేందుకు ప్రతిపాదనలు త్వరగా పంపాలని పోలీసు అధికారులను ఆదేశించారు. రహదారుల పక్కన పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని, లారీలు, ట్రాక్టర్లు, కార్లు తదితర వాహనాలకు ముందు, వెనుక రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు.
హెల్మెట్ ధరించకపోవడం, త్రిబుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, అతివేగం వంటి నిబంధనల ఉల్లంఘనలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. రామగుండం నగరంలో అవసరమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు భద్రత నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో డీసీపీ రామ్‌రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ భావ్‌సింగ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.