పుట్ట మధుకు సర్పంచ్, కాంగ్రెస్ నాయకుల సూటి ప్రశ్నలు

12-11-2026 | 09:59pm

పదేళ్ల పాలనలో ప్రజలకు చేసిన మేలేమిటో చెప్పాలి.. బహిరంగ చర్చకు సిద్ధం

మంథని,(విజయక్రాంతి): బుధవారం తమ గ్రామాన్ని సందర్శించిన మాజీ జెడ్పీటీసీ పుట్ట మధు(Former ZPTC Putta Madhu) చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని రాజపూర్ సర్పంచ్ పుల్లల భాగ్యలక్ష్మి కొమురయ్య(Rajpur Sarpanch Pullala Bhagyalakshmi Komuraiah), కాంగ్రెస్ నాయకులు అన్నారు. గురువారం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో పుట్ట మధు ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమిటో వివరించాలని వారు ప్రశ్నించారు.

తమకు అవకాశం కల్పించిన నాయకుల గురించి మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని హితవు పలికారు. 708 ఎకరాల భూముల అవార్డు, రైతులకు అందాల్సిన పరిహారం, బుధవారంపేట పంచాయతీ రికార్డుల అంశాలపై పుట్ట మధు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు మార్గదర్శకత్వంలో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు మహిళలకు కుట్టు మిషన్, మగ్గం వర్క్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి, గత పాలనపై ఎక్కడైనా బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

 ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ పుల్లెల సతీష్, గ్రామ శాఖ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు మాటేటి శ్రీనివాస్, వార్డు సభ్యులు పుల్లెల సుజాత, కన్నూరి శేషికుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కన్నూరి వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు నామని కొమురయ్య, నంది కుమార్, కాల్వ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు