సుద్దాలలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు: అదనపు కలెక్టర్ గడ్డం నగేష్
కోనరావుపేట,(విజయక్రాంతి): రైతులు పండించిన పత్తికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర అందించడంతో పాటు, కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తెలిపారు. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలోని కావేరి జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని గురువారం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతులకు కల్పించిన సదుపాయాలు, పత్తి కొనుగోళ్లకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేటప్పుడు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పత్తిలో తేమ శాతం ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.
కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రకాష్, వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పాలకవర్గ సభ్యులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, ఆత్మ కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
మల్కపేటలో భూముల రీ సర్వే పరిశీలన
కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే అధికారులకు పలు సూచనలు చేశారు.భూముల రీ సర్వేను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించాలని, భూములకు సంబంధించిన వివరాలను సక్రమంగా సేకరించి నమోదు చేయాలని ఆదేశించారు.
రైతులకు ముందస్తు సమాచారం అందించి, వారి సమక్షంలోనే సర్వే ప్రక్రియ చేపట్టాలని సూచించారు. రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని నిర్ణీత సమయంలో రీ సర్వే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఈ పరిశీలనలో తహసీల్దార్ వరలక్ష్మి, నాయబ్ తహసీల్దార్ ప్రవీణ్, డీఐ రాజేంద్ర ప్రసాద్, సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు.