పశువుల దవాఖానకు తాళం
వైద్యుడి కోసం రైతుల ఎదురుచూపులు
ఫోన్ చేసినా స్పందన కరువు
పశువులకు వైద్యం అందక ఇబ్బందులు
బెజ్జంకి: బెజ్జంకి మండల పరిధిలోని బేగంపేట(Begumpet) గ్రామ పశువుల దవాఖానలో వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో పాడి రైతులు(Farmers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువులకు అనారోగ్యం కలిగితే వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్తే తలుపులు మూసి ఉంటున్నాయని వాపోతున్నారు. వైద్యుడికి ఫోన్ చేసినా సరైన స్పందన ఉండటం లేదని, ఫోన్లో అడిగితే 'వస్తున్నా' అనే సమాధానం తప్ప ప్రత్యక్షంగా వైద్య సేవలు అందడం లేదని ఆరోపిస్తున్నారు.
పశువులపై ఆధారపడి జీవనం సాగించే రైతులకు సకాలంలో వైద్యం అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అత్యవసర సమయంలో వైద్యుడు అందుబాటులో లేకపోతే పశువుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి బేగంపేట పశువుల దవాఖానలో వైద్యుడు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పాడి రైతులు కోరుతున్నారు.
పాడి రైతు విజేందర్ ఆవేదన:
బేగంపేట పశువుల దవాఖానకు డాక్టర్ సకాలంలో రావడం లేదని, ఎన్నిసార్లు ఫోన్ చేసి సంప్రదించినా వస్తున్నాననే సమాధానం తప్ప వైద్యుడు అందుబాటులో ఉండటం లేదని పాడి రైతు విజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమయానికి వైద్యం అందక పశువులు అనారోగ్యానికి గురవుతున్నాయని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పశువులకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.