పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి
పోడు భూములకు పట్టాలివ్వాలి
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి: సీపీఐ నేత కడారి రాములు
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం(Konaraopet Mandal)లో వరి, పత్తి పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలని వేములవాడ నియోజకవర్గ సీపీఐ పార్టీ ఇన్చార్జి కడారి రాములు(CPI party in-charge Kadari Ramulu) డిమాండ్ చేశారు. వరి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30 వేలు, పత్తి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన వరి ధాన్యం, పత్తికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు(Farmers) తమ పంటలను సులభంగా విక్రయించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం అనుకూలంగా ఉన్న ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నేరుగా పంటలను కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
గతంలో రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రస్తుతం ధరలు పెరిగిన తర్వాత అధిక ధరలకు విక్రయిస్తున్నారని, దీనివల్ల ప్రజలపై ధరల భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచాలని కోరారు.
అలాగే, సాగు చేసుకుంటున్న పోడు భూములకు అర్హులైన రైతులకు పట్టాలు మంజూరు చేయాలని, పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న రైతులపై గతంలో నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కోనరావుపేట మండల సీపీఐ నాయకులు బొల్లె బాబు, రొడ్డ దుర్గయ్య, కోలకాని రామస్వామి, బోయిన శంకరయ్య, బాపిరెడ్డి, ఎల్లయ్య, శివరాత్రి దేవన్న తదితరులు పాల్గొన్నారు.