ఆన్లైన్ మట్కా నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
బెజ్జూర్,(విజయకాంతి): బెజ్జూరు మండలం(Bejjur Mandal) చిన్న సిద్దాపూర్ గ్రామ శివారులో ఆన్లైన్ ఐడీల ద్వారా మట్కా గేమ్ నిర్వహిస్తూ అమాయక ప్రజలను జూదం వైపు ప్రేరేపించి, వారి డబ్బులను కాజేస్తున్నారనే నమ్మదగిన సమాచారం ఎస్ఐ కే. రమేష్(Bejjur SI K. Ramesh)కు పొందినట్లు తెలిపారు. వెంటనే స్పందించిన ఎస్ఐ పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకోగా, ముగ్గురు వ్యక్తులు ఆన్లైన్ ఐడీల ద్వారా మట్కా గేమ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
పోలీసులను గమనించిన గుర్లె శ్రీకాంత్ అనే వ్యక్తి అక్కడి నుంచి పరారవగా, కజ్జకరి నిఖిల్, కొట్రంగి కార్తీక్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.పట్టుబడిన వ్యక్తుల వద్ద నుంచి 4 మొబైల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్లు నగదు రూ.400/- స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి పట్టుబడిన ఇద్దరు వ్యక్తులతో పాటు పరారీలో ఉన్న మరో వ్యక్తిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటమని తెలిపారు.
పరారీలో ఉన్న గుర్లె శ్రీకాంత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆన్లైన్ మట్కా, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలి. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఎక్కడైనా ఇలాంటి అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని బెజ్జూరు ఎస్ఐ కే. రమేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.