మెరిసిన ‘పచ్చ’ బంగారం.. పసుపు రైతులకు కాసుల వర్షం!
నిజామాబాద్ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.28,111 ఆల్‌టైమ్ రికార్డు ధర
ఆరు నెలల్లోనే రూ.16 వేల మేర పెరిగిన ధర
విదేశీ మార్కెట్లలో పెరిగిన డిమాండ్
నిల్వ చేసుకున్న రైతులకు భారీ లాభాలు
బోధన్,(విజయక్రాంతి): పసుపు రైతులకు ఈ ఏడాది పంట పండింది. ఎల్‌నినో ప్రభావం(El Nino effect)తో ఏర్పడిన కరువు పరిస్థితుల కారణంగా సాగు విస్తీర్ణం, దిగుబడులు తగ్గడం, మరోవైపు విదేశీ మార్కెట్లలో డిమాండ్ పెరగడం, మార్కెట్‌లో నిల్వలు తగ్గడంతో పసుపు ధరలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో పసుపు క్వింటాల్ ధర ఏకంగా రూ.28,111కు చేరుకోవడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
గత ఏప్రిల్ 30న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్(Nizamabad Agricultural Market)లో క్వింటాల్ పసుపు ధర రూ.12 వేలుగా ఉండగా, కేవలం ఆరు నెలల వ్యవధిలోనే సుమారు రూ.16 వేల మేర పెరిగింది. గత రెండు మూడు రోజులుగా పసుపు ధరలు భారీగా పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
దీపావళి పండుగ సెలవుల అనంతరం బుధవారం తిరిగి ప్రారంభమైన నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాల్ పసుపు ధర కనిష్ఠంగా రూ.24,400 పలకగా, గరిష్ఠంగా రూ.28,111కు చేరింది. ముఖ్యంగా కర్కుమిన్ శాతం అధికంగా ఉండే పసుపు రకాలతోపాటు సేంద్రియ పసుపునకు విదేశీ మార్కెట్లలో డిమాండ్ పెరగడం ధరల పెరుగుదలకు దోహదపడుతోంది.
వేసవిలోనే పంట చేతికి వచ్చినప్పటికీ, వెంటనే విక్రయించకుండా ధరల పెరుగుదల కోసం వేచి చూసి పసుపును నిల్వ చేసుకున్న రైతులకు ప్రస్తుతం మంచి లాభాలు అందుతున్నాయి. అయితే స్థానికంగా పసుపు నిల్వ చేసుకునేందుకు సరిపడా గిడ్డంగులు లేకపోవడం రైతులకు ఇబ్బందిగా మారుతోంది.
రైతులకు తక్కువ వడ్డీతో గిడ్డంగుల నిర్మాణానికి రుణాలు అందించడం, మార్కెట్ ధరలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం, అవసరమైన సమయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం ద్వారా పసుపు రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందని వ్యవసాయ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంగా పసుపు ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరుకోవడంతో నిజామాబాద్ జిల్లాలో పసుపు సాగు చేసిన రైతులకు ఆశలు చిగురిస్తున్నాయి.