ప్రజావాణికి తాళం.. అధికారులకు సెలవా
11 గంటలైనా కంగ్టిలో ఒక్క అధికారి జాడలేదు
కంగ్టి,(విజయక్రాంతి): కంగ్టి మండలంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఉదయం 11 గంటలు దాటినా ఒక్క శాఖ అధికారి కూడా హాజరుకాలేదు. తమ సమస్యలు చెప్పుకునేందుకు,వినతులు సమర్పించేందుకు వచ్చిన ప్రజలు అధికారుల కోసం ఎదురుచూస్తూ తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులే ప్రజావాణి(Prajavani)కి రాకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు అధికారులు అందుబాటులో లేకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకోని అధికారుల తీరుపై ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఇకనైనా ప్రతి సోమవారం అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.