జాతీయ రహదారిపై 'టీ' మాటున మత్తు దందా?

16-11-2026 | 01:14pm

రాత్రి వేళల్లో జాతీయ రహదారి,సరిహద్దు రహదారులపై యథేచ్ఛగా సాగుతున్న ‘స్లైడింగ్’

యువకులు లారీ డ్రైవర్లకు సరఫరా

​నిజాంసాగర్,(విజయక్రాంతి): అది జాతీయ రహదారి(National Highway) పగలు సాధారణ ప్రయాణికులతో రద్దీగా కనిపించే చిన్నపాటి టీ కొట్లు, దాబాలు రాత్రి కాగానే మత్తు దందాకు అడ్డాలుగా మారుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ(Jukkal constituency) పరిధిలోని, నిజాంసాగర్ , పిట్లం, పెద్ద కొడప్ గల్, జుక్కల్, బిచుకుందా, మద్నూర్, మండలాల ప్రధాన రహదారులపై రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా ‘గంజాయి స్లైడింగ్’  జరుగుతోందన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.  

​తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల కూడలిగా ఉన్న జుక్కల్ ప్రాంతం అక్రమార్కులకు వరంగా మారింది. వాహనాల్లో తరలివచ్చే గంజాయిని, ఇక్కడి జాతీయ రహదారిపై ఉన్న కొన్ని ఎంపిక చేసిన టీ కొట్లు, పంక్చర్ షాపులు, దాబాల వద్ద రాత్రి సమయాల్లో చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి (స్లైడింగ్) స్థానిక ఏజెంట్లకు, సరిహద్దు రాష్ట్రాల పెడ్లర్లకు చేరవేస్తున్నట్లు తెలుస్తోంది.  

​‘టీ’ కోడ్ భాషతో వ్యాపారం

రాత్రి 10 గంటలు దాటిన తర్వాత హైవేపై వాహనాల రద్దీ తగ్గిన సమయంలో ఈ దందా ఊపందుకుంటోంది. సాధారణ కస్టమర్లలా వచ్చే యువకులు, లారీ డ్రైవర్లు నిర్దిష్ట కోడ్ భాషను ఉపయోగించి టీ కొట్ల నిర్వాహకుల నుంచి గంజాయి ప్యాకెట్లను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. పోలీసుల నిఘా తక్కువగా ఉండే నిర్మానుష్య ప్రాంతాల్లోని షాపులనే వీరు తమ స్థావరాలుగా ఎంచుకుంటున్నారు.

​యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం

ఈ సులభతరమైన సరఫరా కారణంగా నియోజకవర్గంలోని గ్రామీణ యువత, విద్యార్థులు మత్తుకు బానిసలవుతున్నారు. మత్తు మైకంలో యువత పెడదారి పట్టడంతో పాటు, చిన్నపాటి గొడవలు, దొంగతనాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా పరిధిలోని ప్రధాన రహదారులపై గతంలో భారీ ఎత్తున గంజాయి పట్టుబడిన ఘటనలున్నాయి.

దీనికి తోడు గ్రామాలలో గంజాయి సేవించే యువకులకు స్థానిక పోలీసులు గమనించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన ఫలితం లేకుండా పోతుంది అనేది నగ్నసత్యం. పోలీసులు ఎన్ని రకాల  చర్యలు చేపట్టిన క్షేత్రస్థాయిలో చిల్లర విక్రయాలకు అడ్డుకట్ట పడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సరిహద్దులోని నారాయణఖేడ్ గుండా పిట్లం నిజాంసాగర్ మండలంలోని హైవేపై ఉన్న టీ కొట్టు ల ద్వారా చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారుచేసి  విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

​పోలీసుల నిఘా పెరగాలంటున్న స్థానికులు

సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు మరింత ముమ్మరం చేయాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా తెరిచి ఉండే హైవే టీ కొట్లు, దాబాలపై ప్రత్యేక నిఘా (నైట్ పెట్రోలింగ్) ఏర్పాటు చేయాలని నియోజకవర్గ ప్రజలు, కోరుతున్నారు.

మరిన్ని వార్తలు