అంగన్వాడీల పోషకాహారంతో ఎంతో మేలు

10-11-2026 | 04:54pm

అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

గర్భిణులకు సామూహిక సీమంతాలు, పిల్లలకు అన్నప్రాసన

గంభీరావుపేట నవంబర్ 10(విజయక్రాంతి): అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారంతో పిల్లలు, గర్భిణులకు ఎంతో మేలు చేకూరుతుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్(District Collector Garima Agrawal) తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం 10 నిమిషాల పేరిట కార్యక్ర మాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రానికి ఎంత మంది పిల్లలు వస్తున్నారో ఆరా తీసి.. వారి ఎత్తు, బరువు చూసి.. ఆరోగ్య కార్డుల్లో వివరాలు నమోదు చేసిన తీరును పరిశీలించారు. 

వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం, మందులు పరిశీలించి..  పలు సూచనలు చేశారు. పలువురు గర్భిణులకు సీమంతాలు, పిల్లలకు అన్నప్రాసన చేశారు. ఈ సందర్భంగా వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు, బెల్లం, నువ్వులు బాలామృతంతో సిద్ధం చేసిన ఆహార పదార్థాలను ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ..ప్రతి మంగళవారం 10 నిమిషాలు కార్యక్రమాన్ని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కొనసాగిస్తున్నామని, కేంద్రాల్లో సేవలు, వసతులు మెరుగు పరచడం, పోషకాహారం పంపిణీ, బాలల హక్కుల రక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. 

జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న గర్భిణులు, బాలింతలు, పిల్లలు అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి నెలా తల్లిదండ్రులు బాధ్యతగా ఆరేళ్లలోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు క్రమం తప్పకుండా తీసుకెళ్లాలని వారి ఎత్తు, బరువు నమోదు చేయించాలని దానికి అనుగుణంగా పోషకాహారం అందించాలని సూచించారు. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఇప్పటి నుంచే సరైన పోషకాహారం అందించాలని, దీంతో వారి బంగారు భవితకు బాటలు పడతాయని స్పష్టం చేశారు.

సామ్, మామ్ పిల్లలపై సర్పంచ్, అంగన్వాడీ కేంద్రం బాధ్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. తీవ్రమైన పోషకాహార లోపం, మధ్యస్థ తీవ్ర పోషకాహార లోపం, తీవ్రమైన తక్కువ బరువు, మధ్యస్థ తక్కువ బరువు ఉన్న పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం అందిస్తారని వివరించారు.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారు తయారు చేసిన బాలామృతం, బాలామృతం ప్లస్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

బాలామృతం ప్లస్ తో పిల్లలకు ఇష్టమైన ఆహార పదార్థాలు తయారు చేసి ఇవ్వాలని తెలిపారు. నీరు వేడి చేసి చల్లారిన తర్వాత ఇవ్వాలని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు నిత్యం పంపించడంతో పిల్లలకు  పోషకాహారం అందుతుందని, ఆట, పాటలు బొమ్మల ద్వారా విద్య బుద్దులు చెపుతారని వివరించారు. పిల్లల ఆరోగ్యం, చదువు భవిష్యత్తు తల్లితండ్రుల ఇద్దరి బాధ్యతని పేర్కొన్నారు. సరైన పోషకాహారం ఇంట్లో సైతం ఇవ్వాలని సూచించారు. 

ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి

గర్భిణులు బాలింతలు మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఆకుకూరలు, కూరగాయలు, నువ్వులు, బెల్లం, మునగ ఆకులు, కాయలు ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. గర్భిణులు, పిల్లలు అంగన్వాడీ కేంద్రానికి వచ్చి పోషకాహారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపు నిచ్చారు. ఎదుగుదల లోపించిన పిల్లలకు వైద్యం అందించాలి

5 సంవత్సరాలలోపు వయసు ఉన్న పిల్లలు ఎదుగుదల లోపిస్తే సమీప అంగన్వాడి కేంద్రాల వారికి సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఎదుగుదల లోపాలు గల పిల్లలు, చెవిటి, మూగ, మానసిక బుద్ధి మాంద్యం గల, నడవలేని వాళ్లు, పుట్టుకతో వచ్చే లోపల గల పిల్లలు, మెదడు సంబంధించిన సమస్యలు, సరిగా మాట్లాడలేని పిల్లలు, రక్తహీనత, పోషకాహారం లోపం గల పిల్లలను బాల భరోసా కింద అంగన్వాడీ కేంద్రాల వారి సమాచారంతో వైద్యులు వివిధ పరీక్షలు చేసి పిల్లలలోని లోపాన్ని గుర్తిస్తారని తెలిపారు.

ఆర్ బీ ఎస్ కే వాహనం ద్వారా వేములవాడ ఏరియా ఆసుపత్రిలోని డీఈఐసీ కేంద్రానికి తరలించి.. ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. సేవలను సద్వినియం చేసుకోవాలని సూచించారు. ఉన్నత వైద్య సేవలు కరీంనగర్, హైదరాబాద్ లో అందిస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి హనుమంతు, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ మారుతి రెడ్డి, ఎంపీడీఓ రాజేందర్, సర్పంచ్ ఉమ్మారెడ్డి విమల తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు