సాగుభూమి సంరక్షణపై అవగాహన
- ఎల్నినో ప్రభావం రైతులకు సూచనలు
- యాసంగి సాగుపై అప్రమత్తత విధి విధానాలు
- మండల వ్యవసాయ అధికారి అనూష
ముస్తాబాద్,అక్టోబర్ 28( విజయక్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం లోని రైతు వేదికలో(Farmers' Platform) రైతులకు అవగాహన కార్యక్రమం(Farmers' Awareness Program) నిర్వహించారు.రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం లోటు,భూగర్భ జలాలు సాగునీటి లభ్యతపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో రైతులు యాసంగి పంటల సాగుపై ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని వ్యవసాయ అధికారి అనూష సూచించారు.
ఎల్నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని,ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు అధిక నీటి అవసరం ఉన్న పంటల సాగుపై పునరాలోచన చేయాలని సూచించారు. నీటి వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా సాగు విరామం (క్రాప్ హాలిడే) పాటించే అంశాన్ని పరిశీలించాలని,తద్వారా పెట్టుబడులు పెట్టి నష్టపోయే ప్రమాదాన్ని తగ్గించుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని,తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు,పప్పుధాన్యాలు, నూనెగింజలు స్వల్పకాలిక పంటలపై దృష్టి పెట్టాలన్నారు. వర్షపాతం,భూగర్భ జలాలు, ప్రాజెక్టులు,చెరువుల్లో నీటి నిల్వలను పరిగణనలోకి తీసుకొని పంటల ఎంపిక చేసుకోవాలని, రైతులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుడదని పేర్కొన్నారు.ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ మండల స్పెషల్ ఆఫీసర్ నిర్మల, తహసిల్దార్ అబ్దుల్ ఫారూఖ్, ఎంపీవో అబ్దుల్ వాజిద్,సర్పంచ్ మట్ట వెంకటేశ్వర రెడ్డి,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చిగురు నరేష్,పోతుగల్ సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ శ్రీనివాస్ వివిధ గ్రామాల సర్పంచులు,ఏఈ లు,ఏపీఓ లు రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.