పది రోజులుగా తాగునీరు బంద్!
ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన సారపాక ప్రజలు..
పంచాయతీ అధికారుల తీరుపై ఆగ్రహం..
బూర్గంపాడు, (విజయక్రాంతి): బూర్గంపాడు మండలం సారపాకలో పది రోజులుగా తాగునీటి సరఫరా(Drinking Water Supply) నిలిచిపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ బుధవారం ముత్యాలమ్మ గుడి ఎదుట ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.తాగునీటి కోసం మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నా పంచాయతీ యంత్రాంగం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపించారు.
కనీసం ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయంగా నీటిని సరఫరా చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్య తెలిసినా పంచాయతీ కార్యదర్శి స్పందించడం లేదని మండిపడ్డారు.ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని, అప్పటివరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.