ప్రమాదాల నివారణకు సమన్వయంతో చర్యలు

07-10-2026 | 08:04pm

బ్లాక్‌ స్పాట్లపై ప్రత్యేక దృష్టి : డీసీపీ భాస్కర్

మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి) : రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతకు సంబంధిత శాఖలతో సమన్వయంతో చర్యలు చేపట్టాలని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్(Mancherial DCP Eggadi Bhaskar ) సూచించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశాల మేరకు బుధవారం డీసీపీ కార్యాలయంలో మున్సిపల్, ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారుల శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

మంచిర్యాల, శ్రీరాంపూర్ పరిధిలోని బ్లాక్‌ స్పాట్లు, ప్రమాదకర మలుపులు, కూడళ్లు, రద్దీ ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో రంబుల్‌ స్ట్రిప్స్‌, హెచ్చరిక బోర్డులు, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. బై లేన్‌లు ప్రధాన రహదారుల్లో కలిసే చోట వాహనాల వేగాన్ని నియంత్రించేలా సైనేజీలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

మంచిర్యాల పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీ, నిబంధనల అమలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చర్యలపై చర్చించారు. ట్రాఫిక్‌ నియంత్రణ ట్రాఫిక్‌ పోలీసులకే పరిమితం కాదని, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో భాగస్వాములు కావాలని డీసీపీ సూచించారు.

బ్లాక్‌ స్పాట్ల పరిశీలన

సమావేశం అనంతరం మంచిర్యాల, శ్రీరాంపూర్‌ పరిధిలోని బ్లాక్‌ స్పాట్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రమాదాలకు కారణాలను గుర్తించి తక్షణం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ వివిధ శాఖల సమన్వయంతో ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.

ఈ సమావేశంలో ఏసీపీ ఆర్. ప్రకాశ్‌, శ్రీరాంపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌కుమార్‌, మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్‌ ప్రమోద్‌రావు, మంచిర్యాల రూరల్‌ సీఐ రవీందర్‌, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ హన్నన్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ లక్ష్మీనారాయణ, డీఈ జగదీశ్‌, మున్సిపల్‌ డీఈ రాజేందర్‌, ఏఈ దుర్గం మధు, జాతీయ రహదారుల విభాగం సైట్‌ ఏఈ వినోద్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు