పౌరహక్కులు కాగితాలకే పరిమితం!

03-11-2026 | 05:10am
  1. అట్టడుగు వర్గాలపై పెరుగుతున్న దాడులు
  2. దారితప్పుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
  3. క్షేత్రస్థాయిలో విఫలమవుతున్న పౌరహక్కుల దినోత్సవం

చేవెళ్ళ, నవంబర్ 2 (విజయక్రాంతి): భారత రాజ్యాంగం(Constitution of India) ప్రతి పౌరుడికీ స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవంతో జీవించే హక్కు ను కల్పించింది. సమాజంలో అణచివేతకు గురవుతున్న అట్టడుగు వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ(SC, ST, BC) మరియు పేద ప్రజల్లో తమ హక్కులపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వం ప్రతి నెలా ‘పౌరహక్కుల దినోత్సవం(Civil Rights Day)’ నిర్వహించాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్ మార్గదర్శకాల(District Collector Guidelines) ప్రకారం మండల స్థాయిలో తహశీల్దార్, పోలీసు యంత్రాంగం(Tehsildar and police administration) పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగాలి. కానీ, చేవెళ్ళ నియోజకవర్గంలో(Chevella Constituency) అధికారుల అలసత్వం వల్ల ఈ పౌరహక్కుల దినోత్సవం నిర్వహణ నామమాత్రంగా మారి, కాగితాలకే పరిమితమ వుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయ కక్షసాధింపులు..... గ్రామీణ ప్రాంతాల్లో భయాందోళనలు

స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసినా, కొ న్ని ప్రాంతాల్లో రాజకీయ వేధింపులు కొనసాగుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా పాల న అందించాల్సిన ప్రజాప్రతినిధులు, ప్రత్యర్థి వర్గానికి మద్దతు తెలిపారన్న అక్కసుతో సామాన్యులపై ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా దాడులకు పాల్పడుతున్నారు.

షాబాద్ మండలంలో ఇంటి ప్రాంగణంలో జామకాయలు కోశాడన్న చిన్న నెపంతో ఓ దళిత విద్యార్థి కాళ్లు చేతులు కట్టి ఎండలో ఉంచిన ఘటన సమాజాన్ని తీవ్రంగా కలిచివేసింది. డప్పు కొట్టలేదనే కారణంతో ఒక వ్యక్తిపై దాడి జరగ్గా, ఆపై కేసును పక్కదారి పట్టించేలా పరస్పర ఫిర్యాదులు నమోదు కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భూవివాదాలు...వేధింపులు... 

మల్కాపూర్, కందవాడ గ్రామాల్లో పేదలకు కేటాయించిన లావుని భూముల సాగు విషయంలో అధికార దుర్వినియోగం జరుగుతోందని బాధితులు వాపోతున్నారు. కందవాడలో ప్రతిపక్ష నాయకుడు ఎరుకల శంకరయ్యను ‘ఎన్నికల్లో నువ్వు మద్దతు ఇచ్చిన నాయకుడిని తీసుకురా‘ అంటూ పోలీస్ స్టేషన్ ముందే బహిరంగంగా బెదిరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

పక్షపాత ధోరణిలో పోలీసు యంత్రాంగం?....

బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు, తగిన పత్రాలు చూపించినా న్యాయం చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ప్రశ్నించిన వారిపైనే తిరిగి కేసులు పెడతామని బెదిరించడం పట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ ఉన్మాది చేతిలో కుటుంబమంతా బలైన ఘటనలోనూ పోలీసుల ప్రాథమిక నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. బాధితులు న్యాయం కోసం సీపీ కార్యాలయం మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి దాపురించింది.

అధికారుల నిర్లక్ష్యం....

పౌరహక్కుల దినోత్సవాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తే...చట్టాలపై అవగాహన పెరుగుతుంది.ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, ప్రాథమిక హక్కులు, పౌర బాధ్యతలపై ప్రజల్లో చర్చ జరుగుతుంది.చట్టం పట్ల భయం ఏర్పడి అట్టడుగు వర్గాలపై దాడులు తగ్గుతాయి. 

పేద, నిరక్షరాస్య ప్రజలలో ఆత్మస్థైర్యం నిండుతుంది.అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే అది పరోక్షంగా నేరస్తులను ప్రోత్సహించినట్లే అవుతుంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, చేవెళ్ళ నియోజకవర్గంలో పౌరహక్కుల దినోత్సవాన్ని పక్కాగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు