ట్రాఫిక్ నియంత్రణకు సీపీ వినూత్న సందేశం
శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణాను ఆశ్రయించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలకు ఆదర్శంగా నిలిచేందుకు రసూల్‌పురా మెట్రో స్టేషన్ నుంచి రాయదుర్గం మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. అదనపు డీసీపీలు జి. హనుమంతరావు, జి. నరేందర్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు ఆయనతో కలిసి ప్రయాణించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఐటీ కారిడార్‌లో ఒక్కొక్కరు వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించడం వల్ల రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి పెరుగుతోందన్నారు. మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులను వినియోగించడం వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గడంతోపాటు ఇంధనం, సమయం ఆదా అవుతాయని, కాలుష్య నియంత్రణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, నగర ప్రజలు ప్రజా రవాణాను అలవాటు చేసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.