ఎన్‌హెచ్65 విస్తరణ 12వేల కోట్లు!

10-10-2026 | 05:30am
  1. హైదరాబాద్  విజయవాడ వరకు 6+౨ లేన్లు
  2. త్వరలో పనుల ప్రారంభానికి కార్యాచరణ
  3. ట్రిపుల్ ఆర్‌తో విశ్వనగరంగా హైదరాబాద్
  4. నవంబర్‌లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ 
  5. ఐఆర్‌సీపై సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

అక్టోబర్ 9 (విజయక్రాంతి) : హైదరాబాద్  విజయవాడ  మచిలీపట్నం ఎన్‌హెచ్ ఆరు ప్రధాన లేన్లు, రెండు సర్వీస్ లేన్లతో విస్తరించేందుకు రూ.12,073 కోట్లతో ఇప్పటికే ఆమోదం లభించిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister for Buildings Komatireddy Venkat Reddy) తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక కమిటీల ప్రక్రియ పూర్తయిందని, కేంద్ర మంత్రివర్గ ఆమోదం పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు.

తుది అనుమతులు లభించిన వెంటనే రెండు నెలల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరగనున్న ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ సమావేశ ఏర్పాట్లు, ఇతర అంశాలపై శుక్రవారం మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి అత్యంత కీలకమైన రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.

రంగారెడ్డి గజ్వేల్ భువనగిరి చౌటుప్పల్ మార్గంలో 161.518 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు భూసేకరణ పూర్తయిన నేపథ్యంలో మరోసారి టెండర్లు పిలుస్తామని వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్డు పూర్తయితే హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో విశ్వనగరంగా ఎదుగుతుందని అన్నారు. 

మన్ననూరుేొశ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్..

హైదరాబాద్‌ేొశ్రీశైలం ఎన్‌హెచ్ నల్లమల అటవీ ప్రాంతంలో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం అనుమతులు మంజూరు చేయాలని మంత్రి కోరారు. సుమారు రూ.7,600 కోట్ల అంచనా వ్యయంతో 52 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైందని తెలిపారు. శ్రీశైలం వెళ్లే భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడంతో పాటు నల్లమల అటవీ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని వివరించారు. 

నవంబర్‌లో ఇండియన్ రోడ్ కా్రంగెస్..

నవంబర్ 19 నుంచి 22వ తేదీ వరకు హైటెక్స్‌లో నిర్వహించనున్న 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్(ఐఆర్‌సీ) ఏర్పాట్లు తెలంగాణ ఖ్యాతిని చాటేలా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, రాష్ట్రానికి వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, రవాణా, ఆహారం, ఆతిథ్యం, పర్యాటక ప్రాంతాల సందర్శన తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని సూచించారు.

రాబోయే గ్లోబల్ సమ్మిట్ తరహాలో ఈ జాతీయ సదస్సు ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు. ఐఆర్‌సీ సదస్సుపై విస్తృతంగా ప్రచారం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిసెంబర్‌లో నిర్వహించ బోయే ‘ఇన్వెస్ట్ తెలంగాణ’(గ్లోబల్ సమ్మిట్)లో పెట్టుబడులను ఆకర్శించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 3,000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని, సుమారు 400 ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

సదస్సు ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఐఆర్‌సీ నిర్వహించాలని తాను వ్యక్తిగతంగా, లేఖ ద్వారా చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి 85వ ఐఆర్‌సీని హైదరాబాద్‌లో నిర్వహించే అవకాశం కల్పించినందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.   

మరిన్ని వార్తలు