నెహ్రూకు అనుకూలంగా మొదటి ఓట్ చోరీ
- నెహ్రూ వల్లే కశ్మీర్ అగ్నిగుండం
- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- పటేల్ సేవలను కాంగ్రెస్ మరుగున వేసింది
- బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు
- పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి
హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో కాంగ్రెస్ పార్టీలోని మెజారిటీ సభ్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ మొదటి ప్రధానమంత్రి కావాలని సంపూర్ణ మద్దతు ప్రకటించారని, అయితే నాటి నెహ్రూ కుటుంబం అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాలరాసి, మొదటి ‘ఓటు చోరీ’కి పాల్పడి ఏమాత్రం ప్రజా మద్దతు లేని జవహర్లాల్ నెహ్రూను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) ఆరోపించారు.
తొలి ప్రధానిగా పటేల్ బాధ్యతలు చేపట్టి ఉంటే దేశ ముఖచిత్రం పూర్తిగా మారిపోయేదని, ఎన్నో సంక్లిష్ట సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేదని పేర్కొన్నారు. నెహ్రూ లోపాయికారీ ఒప్పందాలు, స్వార్థ రాజకీయాల వల్ల సంస్థానాల విలీన ప్రక్రియలో తీవ్ర గందరగోళం ఏర్పడిందని మండిపడ్డారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (రాష్ట్రీయ ఏక్తా దివస్) సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావుతో కలిసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పటేల్ హోంమంత్రిగా సాహసోపేత నిర్ణయాలు తీసుకుని 550కి పైగా సంస్థానాలను భారత్‌లో విలీనం చేసి అఖండ భారతాన్ని ఆవిష్కరించారని కొనియాడారు. ప్రత్యేకించి హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలపై నిజాం ప్రైవేట్ సైన్యం దోపిడీలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినా అప్పటి ప్రధాని నెహ్రూ కనీసం స్పందించలేదన్నారు. వల్లభాయ్ పటేల్ తెలంగాణ ప్రజల ఆక్రందనలు చూసి ‘ఆపరేషన్ పోలో’ చేపట్టడంతో నిజాం తోకముడిచారని, తద్వారా ఇక్కడ మువ్వన్నెల జెండా ఎగరవేయగలిగామని గుర్తు చేశారు.
నెహ్రూ విధానాలే కారణం
జమ్ము కశ్మీర్ వ్యవహారంలో సర్దార్ పటేల్ జోక్యాన్ని నెహ్రూ అడ్డుకుని, తన స్వార్థ రాజకీయాలు, పాకిస్థాన్ అనుకూల వైఖరితో ఆ ప్రాంతాన్ని దాదాపు 75 ఏళ్లపాటు అగ్నిగుండలా మార్చారని ఆరోపించారు. నెహ్రూ చారిత్రక తప్పిదాల వల్ల సరిహద్దు ఉగ్రవాదం, యుద్ధాలు చెలరేగి సుమారు 46 వేల మంది అమాయక పౌరులు, జవాన్లు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ ప్రేరేపిత నకిలీ నోట్లు, ఆయుధాల అక్రమ రవాణా, రక్తపాతానికి నెహ్రూ విధానాలే కారణమని స్పష్టం చేశారు. అయితే, ప్రధాని మోదీ దృఢ సంకల్పంతో ఆర్టికల్ 370ని రద్దు చేసి, కశ్మీర్లో రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేసి పటేల్ కన్న కలలను సాకారం చేశారని కొనియాడారు.
పటేల్ సేవలను విస్మరించిన కాంగ్రెస్ : రాంచందర్ రావు
దేశ సమగ్రత, సార్వభౌమాధికార పరిరక్షణ కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కొనియాడారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ వందలాది సంస్థానాలను ఏకం చేసి ఆధునిక భారతదేశానికి పటిష్టమైన పునాది వేసిన ఘనత పటేల్‌దేనని పేర్కొన్నారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాల పాటు పటేల్ సేవలను మరుగున పరిచే ప్రయత్నం చేసిందన్నారు. ప్రధాని మోదీ గుజరాత్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తున ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని నిర్మించి, దేశవ్యాప్తంగా ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ను అధికారికంగా నిర్వహించడం ద్వారా పటేల్ కీర్తిని దశదిశలా వ్యాపింపజేశారని తెలిపారు.
తెలంగాణ విముక్తిలో సర్దార్ పటేల్ పాత్ర అజరామరమని, నేటి యువత ఆయన క్రమశిక్షణ, దేశభక్తి, నిస్వార్థ సేవలను ఆదర్శంగా తీసుకుని నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్. గౌతం రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.