ప్రశాంతంగా ఆర్టీసీ ఎన్నికలు

10-10-2026 | 05:30am
  1. మొత్తం 34,889 ఓట్లలో పోలైన 33,973 ఓట్లు
  2. కరీంనగర్‌లో 97, గ్రేటర్ హైదరాబాద్‌లో 98 శాతం పోలింగ్
  3. ఈ నెల 17న అధికారికంగా ఫలితాల వెల్లడి
  4. పదేళ్ల తర్వాత జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు

అక్టోబర్ 9 (విజయక్రాంతి): పదేళ్ల తర్వాత నిర్వహించిన తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం(Telangana RTC Recognized Union) ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం సాయంత్రం వరకు మొత్తం 97 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 5 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 115 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 97 బస్సు డిపోల్లో పోలింగ్ సాగింది. మొత్తం 34,889 ఓట్లు ఉండగా, 33,973 ఓట్లు పోలయ్యాయి.

అత్యధికంగా రెండు చోట్ల పోలింగ్ నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్‌లో 98 శాతం, కరీంనగర్‌లో 97 శాతం ఓట్లు పోలయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో 32, హైదరాబాద్ జోన్‌లో 38, కరీంనగర్ జోన్‌లో 45 పోలింగ్‌బూత్‌లు ఏర్పాటు చేశారు.

ఒక్కొక్కరు రెండు ఓట్లు!

ప్రతి కార్మికుడికి రెండేసి ఓట్లు ఉంటాయి. రాష్ట్రస్థాయి గుర్తింపు సంఘం కోసం ఒకటి, రీజియన్ స్థాయి గుర్తింపు కోసం మరో ఓటు వినియోగించుకోవచ్చు. ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏ యూనియన్ విజయం సాధిస్తుందో శుక్రవారం అర్ధరాత్రికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా మూడు కూటముల మధ్య పోటీ నెలకొనగా, ఎవరికి వారే గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు ఈ నెల 14, 15న పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. ఈ నెల 17వ తేదీన ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు గెలుపోటములను నిర్దేశం చేయనున్నాయి. తమ చిరకాల కోరిక అయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కృషి చేసే వారినే గెలిపిస్తామని కార్మికులు అంటున్నారు. పార్టీల వారీగా యూనియన్లు ఉండడంతో ఈ ఎన్నికలు రాజకీయంగా రసవత్తరంగా మారాయి.

ముక్కోణపు పోరు..

మొత్తం 12 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. ఇవి మూడు కూటములుగా ఏర్పడితే, కొన్ని సంఘాలు స్వతంత్రంగా పోటీ చేశాయి. ప్రధానంగా పోటీలో నిలిచిన వారిలో ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ వర్కర్స్ యూని యన్, తెలంగాణ జాతీయ మజ్దూర్ కూటములున్నాయి. ఇందులోనూ ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ వర్కర్స్ యూనియన్ మధ్యనే ప్రధాన పోరు నెలకొంది. దశాబ్ద కాలం తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు జరగడంతో బస్ డిపోలలో యూనియన్లు ప్రచారాలు నిర్వహించాయి.

మరిన్ని వార్తలు