మహిళా సాధికారతకు కుట్టు శిక్షణ ఎంతో దోహదం
మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి
రామచంద్రపురం నవంబర్ 12: భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ ఎం.ఐ.జి. కాలనీలో(Old MIG Colony) జానని మహిళా మండలి ఆధ్వర్యంలో, అక్షయ శక్తి ఫౌండేషన్(Akshaya Shakti Foundation) సహకారంతో మహిళా సాధికారత లక్ష్యంగా నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఇలాంటి వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ముఖ్యంగా పేద మహిళలకు కుట్టు శిక్షణ అందించడం ద్వారా వారు స్వయంగా ఉపాధి పొందుతూ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అక్షయ శక్తి ఫౌండేషన్ సభ్యురాలు వాణి, వీరస్వామి, శివరాం రెడ్డి, జానని మహిళా మండలి సభ్యులు లక్ష్మి, స్వర్ణలత, మహిళ నాయకులు లత శ్రీ,జ్యోతి, సొసైటీ అధ్యక్షుడు బాలయ్య, ఉపాధ్యక్షుడు నారాయణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భాస్కర్ ముదిరాజ్, చిన్న, సురేందర్, పద్మ తదితరులు పాల్గొన్నారు.