నంగునూరు పెద్దాసుపత్రిలో అందని వైద్యం!

03-11-2026 | 05:10am
  1. ‘గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్ ఉన్నా సిద్దిపేట కే రిఫర్
  2. పనిచేయని ఎక్స్‌రే మిషన్
  3. వైద్యులు, నర్సుల కొరతతో రోగుల ఇక్కట్లు
  4. డిప్యుటేషన్లతో కుంటుపడుతున్న ప్రభుత్వ వైద్య సేవలు

నంగునూరు, నవంబర్ 2: సిద్దిపేట జిల్లా(Siddipet District) నంగునూరు మండల కేంద్రంలోని 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం(Community Health Centre) పేరుకే పెద్ద ఆసుపత్రిగా మిగిలిపోతోంది. వైద్యులు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో సేవలు అందకపోవడం, ఎక్స్‌రే మిషన్ పనిచేయకపోవడం, డాక్టర్ల, నర్సుల(doctors and nurses) కొరతతో పాటు డిప్యూటేషన్ల కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి గాయాల నుంచి ఎముకల సమస్యలు, ప్రసవాల వరకు అనేక సందర్భాల్లో రోగులను సిద్దిపేటకు రిఫర్ చేస్తుండటంతో ఈ ఆసుపత్రి సేవలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కోట్లు ఖర్చు.. వైద్యం కరువు..

గజ్వేల్,దుబ్బాక,హుస్నాబాద్, చేర్యాల పట్టణాల తరహాలోనే నంగునూరు మండల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బి ఆర్ ఎస్ హయాంలో రూ.8.20 కోట్ల వ్యయంతో ఈ 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని(Community Health Center) అన్ని హంగులతో నిర్మించి 2017 మే 8న ప్రారంభించారు. నేడు అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది కొరత కారణంగా ఆశించిన స్థాయిలో వైద్య సేవలు అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

రోజుకు 150కి పై గా ఓపీ..

ఈ ఆసుపత్రికి రోజుకు 150కి పైగా రోగులు వస్తున్నారని రికార్డులు చెబుతున్నాయి. రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదనీ, అవసరం అయిన వారికి ఇన్ పేసెంట్ గా సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్, జనరల్ ఫిజిషియన్, వివిధ విభాగాల ప్రత్యేక వైద్య నిపుణులు, సూపరింటెండెంట్ సహా మొత్తం 9 మంది వైద్యులు ఉన్నారు.

కొందరు వైద్యులు వారంలో 2 లేదా 3 రోజులు గజ్వేల్కు డిప్యూటేష్ప వెళ్తున్నారు. వైద్యులు అందరూ విధులకు రాకుండా వంతులవారీగా రోజుకొకరు లేదా ఇద్దరు మాత్రమే విధులకు హాజరవుతున్నారు. రెగ్యులర్ వైద్యులు లేకపోవడంతో పీజీ విద్యార్థులతో వైద్యం అందిస్తున్నారు. చిన్నపాటి గాయాలకు ప్రథమ చికిత్స లేదా కుట్లు వేసే సౌకర్యాలు కూడా అందుబాటులో లేక రోగులను సిద్దిపేటకు పంపిస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు.

పనిచేయని ఎక్స్‌రే మిషన్.. నిలిచిన ప్రసవాలు

ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ వైద్యుడు ఉన్నప్పటికీ, ఎక్స్ రే మిషన్ కొంతకాలంగా పనిచేయకపోవడంతో ఎముకల సమస్యలతో వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పరీక్షల కోసం కూడా బయటి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది. మరోవైపు, గైనకాలజిస్ట్ అందుబాటులో ఉన్నప్పటికీ ప్రసవాలు నిర్వహించడం లేదు. గర్భిణుల ను సైతం సిద్దిపేటకే రిఫర్ చేస్తుండటంతో ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం చేయించు కోవాలనుకునే మహిళలకు నిరాశ ఎదురవుతోంది. ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ కు  కొంతకాలంగా తాళం వేసి ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

నర్సుల కొరత.. ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్లు

నంగునూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక్కడ 20 నర్సుల పోస్టులు ఉండగా... ఒక హెడ్ నర్సు హైదరాబాద్ కు, మరో 7 నర్సులు ఇతర ప్రాంతాలకు (హుస్నాబాద్ కు 3, గజ్వేల్ కు 3, చేర్యాలకు 1) డిప్యూటేషన్ పై వెళ్లినట్లు సమాచారం. మిగిలిన 12 మందిలో ఒక పోస్టు ఖాళీగా ఉండటంతో, కేవలం 12 మందే విధుల్లో ఉంటున్నారు. ఇక ల్యాబ్ టెక్నీషియన్లలో ఒకరు రెగ్యులర్ కాగా, మరొకరు ఔట్సోర్సింగ్లో పనిచేస్తున్నారు. తెలుస్తుంది. సిబ్బంది మొత్తం డిప్యూటేషన్లపై వెళ్లడం వల్ల ఆసుపత్రిలో వైద్య సేవలు అందడం లేదు.

24 గంటలు వైద్యం అందించాలి

ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చేందుకు కోట్లాది రూపాయలతో నిర్మించిన 50 పడకల ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్య సేవలు అందకపోవడం పై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో సరైన వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేసినా పరిస్థితుల్లో మార్పు రాలేదని ప్రజలు వాపోతున్నారు. తక్షణమే డిప్యూటేషన్లు రద్దు చేసి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని.. ఎక్స్రే మిషన్ను పునరుద్ధరించి, 24 గంటల వైద్య సేవలు, ప్రసవాలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

జర మీరైనా చూడండి సార్

ఇక్కడ ఆస్పత్రి నిర్మాణానికి కృషిచేసిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సారు మీరైనా పట్టించుకోండి అంటూ మండల ప్రజలు వేడుకుంటున్నారు. నిర్మింపజేసిన మీరైనా నిర్వహణ లోపాన్ని సరిచేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు