ప్రకృతి వ్యవసాయంతో సాగు ఖర్చులు తగ్గించుకోవాలి
జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి
గజ్వెల్, నవంబర్21: రసాయన ఎరువులు(Chemical fertilizers), పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి(District Agriculture Officer Swarooparani) రైతులకు సూచించారు. నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్(National Mission on Natural Farming) (ఎన్ఎంఎన్ఎఫ్) కార్యక్రమంలో భాగంగా దాతరపల్లి గ్రామంలోని బయో రిసోర్స్ సెంటర్ వద్ద ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సహజ వనరులు, జీవ ఎరువులు, జీవ ద్రావణాల వినియోగంతో సాగు ఖర్చులు తగ్గించుకోవచ్చని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా భూసారం పెంపొందించడంతో పాటు నాణ్యమైన, ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులను పొందవచ్చన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అలవర్చుకొని పర్యావరణ పరిరక్షణతో పాటు స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఓ నాగరాజు, టెక్నికల్ ఏఓ మైథిలి, గ్రామ సర్పంచ్ దివ్య రాజకుమార్, ఏఈఓ మీనాక్షి, రైతులు పాల్గొన్నారు.