సవాలును స్వీకరించారు.. సురక్షిత ప్రసవం చేశారు
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (Palvancha Community Health Center) వైద్యులు సమయస్ఫూర్తి, వైద్య నైపుణ్యంతో అరుదైన వైద్య విజయాన్ని సాధించారు. పలు ఆరోగ్య సమస్యలతో కూడిన హైరిస్క్ గర్భిణికి అత్యవసర సిజేరియన్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి తల్లీబిడ్డ ఇద్దరినీ క్షేమంగా కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. పాల్వంచ మండలానికి చెందిన 25 ఏళ్ల శిరీష మొదటి కాన్పు కోసం , పాల్వంచ CHCకి వచ్చింది.
ఆమెకు థైరాయిడ్ సమస్య, గర్భధారణ సమయంలో రక్తపోటు పెరగడం, రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటం వంటి సమస్యలతో పాటు 115 కిలోల అధిక శరీర బరువు కూడా ఉంది. అంతేకాకుండా కడుపులోని శిశువు కూడా అధిక బరువుతో ఉండటంతో వైద్యులు ఈ కేసును హైరిస్క్‌గా గుర్తించారు. సాధారణంగా ఇలాంటి క్లిష్టమైన కేసులను మెరుగైన వైద్య సదుపాయాలున్న పెద్ద ఆసుపత్రులకు తరలిస్తుంటారు.
అయితే ఈ కేసును పాల్వంచ CHCలోనే నిర్వహించేందుకు ప్రసూతి వైద్యురాలు డాక్టర్ ఎస్. లీనా, మత్తు వైద్యుడు డాక్టర్ పి. రాంప్రసాద్ ప్రత్యేక చొరవ చూపారు. కేసులోని ప్రమాదాలను అంచనా వేసి, పరస్పర సమన్వయంతో బాధ్యతగా ముందడుగు వేసి ఈ సవాలును స్వీకరించారు. అవసరమైన వైద్య ఏర్పాట్లతో తమ వైద్య బృందంతో కలిసి విజయవంతంగా అత్యవసర సిజేరియన్ శస్త్రచికిత్స నిర్వహించారు.వారి సమయస్ఫూర్తి, వైద్య నైపుణ్యం, సమన్వయంతో 3.25 కిలోల బరువున్న ఆడ శిశువు సురక్షితంగా జన్మించింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.
సాధారణంగా ఉన్నతస్థాయి ఆసుపత్రులకు పంపించే ఇలాంటి క్లిష్టమైన కేసును స్థానిక CHCలోనే స్వీకరించి, విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించిన ప్రసూతి వైద్యురాలు డాక్టర్ ఎస్. లీనా, మత్తు వైద్యుడు డాక్టర్ పి. రాంప్రసాద్‌తో పాటు మొత్తం వైద్య బృందాన్ని జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయ అధికారి (DCHS) డాక్టర్ రవి బాబు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ముక్కంటేశ్వరావు ప్రత్యేకంగా అభినందించారు. పెద్దాసుపత్రులకు దీటుగా ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం వంటి చిన్న ఆసుపత్రులలో సైతం నాణ్యమైన ప్రసూతి వైద్యం, అత్యవసర శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
మాకు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి అంటే నమ్మకం .. అందుకే ఇక్కడ ప్రసవం- కుటుంబ సభ్యులు
మా కుటుంబం లో చాలా మంది పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవం జరిగిందనీ, కోవిడ్ సమయంలో సైతం ఇక్కడే మా కుటుంబ సభ్యుల కు కాన్పు సురక్షితంగా చేశారని. అందుకే రక్తపోటు , మధుమేహం , అధిక బరువు, మొదలగు సమస్యలు ఉన్న కూడా నమ్మకం తో వచ్చామని, మా నమ్మకాన్ని వమ్ము కాకుండా వైద్యులు సురక్షిత ప్రసవం చేశారని భర్త శశి కాంత్ తెలిపారు. 20 ఏళ్ల క్రితం తను కూడా ఇక్కడే ప్రసవం చేపించుకున్నానని, ఇప్పుడు తన కూతురు సైతం పాల్వంచ ఆసుపత్రిలో ప్రసవం జరగడం ఆనందంగా ఉందని,ఆసుపత్రి వైద్యులకి, సిబ్బందికి మా కుటుంబం రుణపడి ఉంటామని శిరీష తల్లి భాగ్యమ్మ తెలిపారు.