చిన్నారుల ప్రతిభ చాటిన సైన్స్ ఫెయిర్!
* సైన్స్ ఫెయిర్లో విద్యార్థుల ప్రతిభకు అద్దం
* జిల్లా స్థాయి ప్రదర్శనలో 268 నమూనాలు
* వ్యవసాయం, వైద్యం, చోరీల నివారణకు సాంకేతిక పరిష్కారాలు
సిద్దిపేట టౌన్, నవంబర్ 27: చిన్నారుల ఆలోచనలు.. సమాజ సమస్యలకు పరిష్కారాలుగా రూపుదిద్దుకున్నాయి. జిల్లా విద్యాశాఖ(District Education Department) ఆధ్వర్యంలో సిద్దిపేటలోని(Siddipet) నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్లో(District-Level Science Fair) విద్యార్థులు రూపొందించిన వినూత్న నమూనాలు ఆకట్టుకున్నాయి.
మందులు సమయానికి వేసుకోవడం మరిచిపోయే వారికి హెచ్చరికలు అందించేలా రూపొందించిన ‘స్మార్ట్ మెడిసిన్ రిమైండర్(Smart Medicine Reminder)’, పత్తి ఏరేటప్పుడు చేతులకు కర్రలు గుచ్చుకోకుండా రూపొందించిన ‘కాటన్ ప్రో గ్రిప్(Cotton Pro Grip)’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే వాహనాల చోరీల నివారణకు సాంకేతిక నమూనా, పంటలకు హాని చేసే కీటకాల నియంత్రణకు ‘ఎలక్ట్రిక్ ఇన్సెక్ట్ కిల్లర్’ నమూనాల ను విద్యార్థులు ప్రదర్శించారు.
వ్యవసాయం, వైద్యం, పర్యావరణ పరిరక్షణతో పాటు నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలను చూపుతూ విద్యార్థులు తమ శాస్త్రీయ ఆలోచనా నైపుణ్యాన్ని చాటుకున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్, జిల్లా సైన్స్ అధికారి రాజమౌళి ప్రదర్శనను పర్యవేక్షించి విద్యార్థుల నమూనాలను పరిశీలించారు.