36వ అఖిల భారత రైతు మహాసభలను జయప్రదం చేయండి
నల్లగొండలో వీర తెలంగాణ పోరాట స్ఫూర్తితో రైతాంగ మహా సమరం
నేరేడుచర్ల,(విజయక్రాంతి): వీర తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ కేంద్రంలో ఈ నెల 15 నుండి 18 వరకు జరగనున్న 36వ అఖిల భారత రైతు మహాసభలను జయప్రదం చేయాలని, ఈ నెల 15వ తేదీ ఆదివారం జరిగే బహిరంగ మహాసభకు కార్మికులు, కర్షకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు కలిసికట్టుగా తరలిరావాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి(CPM District Secretary Mallu Nagarjuna Reddy) పిలుపునిచ్చారు.
గురువారం నేరేడుచర్లలోని సీపీఎం కార్యాలయం(CPM Office) అరి బండి భవన్లో రైతు మహాసభల గోడపత్రికను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం, కార్పొరేట్ దోపిడీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఏకమవుతున్న తరుణంలో నల్లగొండ వేదికగా జరుగుతున్న ఈ మహాసభలు చారిత్రాత్మకమైనవని అన్నారు.రాష్ట్రంలో బీడు భూములకు, ప్రాజెక్టుల కోసం సేకరించిన పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, కౌలు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
పంట రుణాలు, నాణ్యమైన ఎరువులు, విత్తనాల సరఫరా సక్రమంగా జరగడం లేదని, నేటికీ రుణమాఫీ అమలు కానీ రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని, పెండింగ్లో ఉన్న రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రకటించిన వాగ్దానాల అమలు కోసం రైతు సంఘం అనేక రకాల ఆందోళనలు చేస్తుందని తెలిపారు.
మాటలు కాదు, చేతలు కావాలని, వాగ్దానాలను గాలికి వదిలేస్తే రైతాంగం ఊరుకోదని హెచ్చరించారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను స్థాపించి గ్రామీణ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కందగట్ల అనంత ప్రకాష్, కొదమగుండ్ల నాగేష్, సీపీఎం పార్టీ మండల కార్యదర్శి సిరికొండ శ్రీను, సీఐటీయూ మండల కన్వీనర్ నీల రామ్మూర్తి, పాతూరి శ్రీనివాస రావు,నన్నెపంగా రమేష్ తదితరులు పాల్గొన్నారు.