ఇరుకు రోడ్డుతో ఇక్కట్లు..!

03-11-2026 | 05:15am

విస్తరణకు ఎదురుచూపులు

కీతవారిగూడెంలో 500 మీటర్ల మేర తప్పని ట్రాఫిక్ కష్టాలు

రూ.1.50 కోట్లతో రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు

సమస్యను పరిష్కరించి ఇబ్బందులు తొలగించాలని వాహదారుల వేడుకోలు

గరిడేపల్లి, నవంబర్ 2 : రెండు జాతీయ రహదారులను(National Highways) అనుసంధానించే వెలిదండకీతవారిగూడెం ప్రధాన రహదారిపై ట్రాఫిక్ కష్టాలు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కీతవారిగూడెం గ్రామంలోని(Keethavarigudem village) మసీదు సమీపం నుంచి గ్రామ సెంటర్ వరకు సుమారు 450 నుంచి 500 మీటర్ల మేర రహదారి ఇరుకుగా ఉండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఒక పెద్ద వాహనం వస్తే ఎదురుగా మరో వాహనం వెళ్లేందుకు దారి లేక ట్రాఫిక్ నిలిచిపోతోంది. దీంతో వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

 డ్రైనేజీ లేక అవస్థలు 

 రహదారి ఇరుకుగా ఉండటంతోపాటు డ్రైనేజీ సౌకర్యం లేకపోవడం స్థానికులకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. వర్షం కురిస్తే రహదారి చిత్తడిగామారుతుండటంతో చిరు వ్యాపారులు, ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం పాఠశాల విద్యార్థుల రాకపోకల సమయంలో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవు తోంది. ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతు న్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 ఏళ్లు తరబడి అసంపూర్తిగానే.. : 

మునగాల నుంచి వెలిదండ మీదుగా కీతవారిగూడెం వరకు రెండు జాతీయ రహదారులను అనుసంధానించే రహదారి నిర్మాణ పనులు 2021లో ప్రారంభమై, 2023 నాటికి పూర్తయ్యాయి. అయితే కీతవారిగూడెం గ్రామ పరిధిలోని ఇరుకైన రహదారి సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించేవారికి నిత్యం ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. సంబంధిత అధికారులు స్పందించి రహదారిని విస్తరించి, డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.     

రూ.1.50 కోట్లతో ప్రతిపాదనలు 

గతంలో మునగాలకీతవారిగూడెం రహదారికి నిధులు మంజూరైనా, కొం దరు గ్రామస్తుల సహకారం లేకపోవడం తో పనులు నిలిచిపోయి కాంట్రాక్టు రద్దయింది. ప్రస్తుతం వెలిదండ వద్ద కల్వర్టు నిర్మాణంతోపాటు కీతవారిగూడెంలో రహదారి నిర్మాణానికి రూ.1.50 కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.. ప్రభుత్వ అనుమతులు రాగానే పనులు ప్రారంబిస్తాం రహదారి విస్తరణ పనులు పూర్తయితేనే ప్రజల ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. 

రమేష్, డీఈ, హుజూర్ నగర్

సమస్య పరిష్కరానికి అందరూ కృషి చేయాలి

రెండు జాతీయ రహదారులను కలిపే రహదారి ఇది. ఈ రో డ్డులో కీతవారి గూడెంలో కేవలం 500 మీటర్లు మాత్రమే ఇరుకుగా ఉంది. దీంతో వా హనాల రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. ఇది అందరి సమస్య. కావున ఇక్కడ నెలకొన్న సమస్య పరిష్కారానికి అందరు కృషి చేయాలి. అప్పుడే ఇబ్బందులు ఉండవు. -

జుట్టుకొండ సత్యనారాయణ, పిఎసిఎస్ చైర్మన్, రాయినిగూడెం.

మరిన్ని వార్తలు