కిసాన్ మేళా ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టాలి
కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్, నవంబర్ 10 (విజయక్రాంతి): వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం నుంచి అన్నదాతలను కాపాడేందుకు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘కిసాన్ మేళా’ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద(Collector Dr Satya Sharada) అధికారులను ఆదేశించారు.
మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) ఆధ్వర్యంలో నిర్వహించబోయే కిసాన్ మేళా ముందస్తు ప్రణాళికపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో తగిన మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఆరుతడి పంటల వైపు మళ్లించాలి
ఎల్నినో ప్రభావంతో భవిష్యత్తులో భూగర్భ జలాలు తగ్గే ముప్పు ఉన్నందున, రైతులు అధిక నీరు కోరే పంటలకు స్వస్తి పలికి. తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకునేలా అవగాహన కల్పించాలి.తక్కువ పెట్టుబడితో మెరుగైన దిగుబడులు సాధించే విధానాలు, నీటి పొదుపు మెలకువలను స్టాళ్ల ద్వారా రైతులకు వివరించాలి. రైతులకు బ్యాంకుల ద్వారా అందే పంట రుణాలు, ఇతర ఆర్థిక సహాయం, సోలార్ పథకాలతో కలిగే ప్రయోజనాలపై పూర్తి సమాచారం అందించాలి.
ప్రభుత్వ పథకాలు, సాంకేతిక సలహాలు అన్నీ ఒకే వేదికపై లభించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఎల్. కిషోర్ కుమార్ (రెవెన్యూ), వై.వి. గణేష్ (స్థానిక సంస్థలు), డీఆర్వో విజయలక్ష్మి, ‘ఆత్మ’ పీడీ విజయ నిర్మల, డీసీవో నీరజ, విద్యుత్ శాఖ ఎస్ఈ ఆనందం, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నిర్మల, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్ రావు, వ్యవసాయ అధికారి విజయ్ భాస్కర్, పశుసంవర్ధక అధికారి బాలాజీ, మత్స్యశాఖ శ్రీపతి, డీఆర్డీవో నాగ పద్మజ, సీపీవో చంద్రకళ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.