ఆసుపత్రికి రోగులు.. అయినా తప్పని దిగులు..!

06-10-2026 | 05:20am
  1. చౌటుప్పల్‌లో నెమ్మదిగా సాగుతున్న వంద పడకల ఆసుపత్రి పనులు..                                          
  2. ప్రస్తుత ఆసుపత్రిలో తీవ్ర బెడ్ల కొరత
  3. బయట బెడ్లు ఏర్పాటు చేసి వైద్యం.. రోగుల అవస్థలు
  4. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ప్రజల విజ్ఞప్తి

చౌటుప్పల్, అక్టోబర్ 5 : ప్రైవేటు ఆసుపత్రులు రోగుల(Private hospitals treat patients) నుండి పైసలు జలగల లాగా పీల్చేస్తుంటేనే  ఆ భారమును మోయలేకే పేదలు ప్రభుత్వాసుపత్రి దారి పడుతున్నారు. దీంతో ప్రభుత్వాసుపత్రిల్లో(Government Hospital) రోగుల రద్దీ రోజురోజుకూ పెరుగుతుంది. అందుకు అనుగుణంగా సరైన వసతులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిగ్గా ఇదే పరిస్థితి చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రిలో దాపురించింది.

ఈ ఆసుపత్రికి వచ్చే రోగులు బాగా పెరగడంతో ఇప్పటికే ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన బెడ్లు నిండి కొన్ని సందర్భాల్లో బయట ప్రాంగణంలో బెడ్లు ఏర్పాటు చేసి రోగులకు వైద్యం అందించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. మరోవైపు రోగుల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి పనులు నెమ్మదిగా సాగుతుండటంతో కొత్త భవనం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

పెరుగుతున్న రోగుల రద్దీ

చౌటుప్పల్ పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలు, పరిసర ప్రాంతాల నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రభుత్వాసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ వైద్యం ప్రధాన ఆధారంగా ఉండటంతో ఆసుపత్రిలో రోగుల రద్దీ అధికంగా ఉంటోంది. అయితే ప్రస్తుతం ఉన్న పడకల సంఖ్య రోగుల అవసరాలకు సరిపోవడం లేదు. ఇన్పేషెంట్ రోగుల సంఖ్య పెరిగిన సమయంలో బెడ్లు పూర్తిగా నిండిపోతుండటంతో అదనపు బెడ్లను బయట ప్రాంగణంలో ఏర్పాటు చేయాల్సి వస్తోంది. దీంతో రోగులు, వారి సహాయకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నత్తనడకన నిర్మాణ పనులు 

చౌటుప్పల్ ప్రజల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే పనులు ఆశించిన వేగంతో కాకుండా నత్త నడకన సాగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిలో రోగుల రద్దీ, బెడ్ల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కొత్త ఆసుపత్రి నిర్మాణం త్వరగా పూర్తయితేనే ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు ప్రస్తుత ఆసుపత్రిపై రోగుల భారం తప్పదని, అందువల్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

ఆరుబయట బెడ్లు.. అక్కడే సేవలు! 

ప్రస్తుతం ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్యకు అనుగుణంగా బెడ్లు లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో ఆసుపత్రి బయట కూడా బెడ్లు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాల్సి వస్తోంది. దీంతో రోగులకు సరైన సౌకర్యాలు కల్పించడం కష్టంగా మారుతోంది. ముఖ్యంగా అత్యవసర వైద్యం అవసరమైన వారు, వృద్ధులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఒకవైపు కొత్త 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కొనసాగుతుండగా.. మరోవైపు పాత ఆసుపత్రిలో రోగుల రద్దీ పెరుగుతుండటంతో పరిస్థితి రోజురోజుకూ ఇబ్బందికరంగా మారుతోందని ప్రజలు అంటున్నారు.

పనులు పూర్తయితేనే మెరుగైన వైద్య సేవలు  

100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే చౌటుప్పల్తో పాటు పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందనీ స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం ఎదురవుతున్న బెడ్ల కొరతకు కూడా పరిష్కారం లభించనుందనీ వారు చెబుతున్నారు. అందువల్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. నిర్మాణ పనుల పురోగతిపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు .

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దృష్టి సారించాలని వినతి

 మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రిలో నెలకొన్న బెడ్ల కొరత, రోగుల ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు స్థానికులు కోరుతున్నారు. 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను సంబంధిత అధికారులతో సమీక్షించి, పనుల్లో వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి అయ్యే వరకు ఆసుపత్రికి వచ్చే రోగులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.   

మెరుగైన సేవలు అందుబాటులోకి రావాలి

నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆస్పత్రి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసి మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావాలి. ప్రస్తుతం ఆస్పత్రిలో రోగుల రద్దీ ఎక్కువగా ఉంది.దీంతో వృద్ధులు, పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులు అన్నీ తొలగిపోవాలంటే అధికారులు 100 పడకల ఆసుపత్రి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలి.అప్పటి వరకు ఆసుపత్రికి వచ్చే రోగులకు సాధ్యమైనంత వరకు ఇబ్బందులు లేకుంటా సిబ్బంది, ఇతర అధికారులు చొరవ చూపాలి.

 వెలిజాల నరహరి, స్థానికుడు

మరిన్ని వార్తలు